
KCR-ABN RK : స్నేహితుల మధ్య ప్రేమానురాగాలే కాదు.. గిల్లికజ్జాలు కూడా ఉంటాయి.. ఇవి శృతిమించితే శత్రుత్వానికి కూడా దారి తీస్తాయి. ఇప్పుడు అదే వేమూరి రాధాకృష్ణ, కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్య జరుగుతున్నది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు, వేమూరి రాధాకృష్ణ ఆ బీట్ చూస్తున్నప్పుడు కెసిఆర్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. బావాబామ్మర్దులు అని పిలుచుకునేంత బంధం బలపడింది. 2019 దాకా అది నిరాటంకంగా సాగింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు ఉప్పు నిప్పులాగా వ్యవహారం సాగుతోంది.. ఆ మధ్య కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం లో వినిపించినప్పుడు వేమూరి రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి పేపర్ లో బ్యానర్ వార్తగా ప్రజెంట్ చేశాడు. కెసిఆర్ అంటే భయపడుతున్న తరుణంలో, ఒక మీడియా యజమానిగా ఈ స్థాయి ధైర్యం చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ వేమూరి రాధాకృష్ణను అభినందించాల్సి ఉంటుంది. తర్వాత అదే కవిత వేమూరి రాధాకృష్ణ ఛానల్ కు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాన్ మీద ఏదేదో మాట్లాడింది. అసలే బూతద్దం పెట్టి చూసేవాడు కదా… “నువ్వు ప్రగతి భవన్ వెళ్ళినప్పుడు మీ నాన్న నిన్ను తిట్టలేదా? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని” కవితను అడ్డంగా బుక్ చేశాడు రాధాకృష్ణ.. ఇది సహజంగానే కెసిఆర్ ను ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత ప్రగతిభవన్ లో రాధాకృష్ణకు లీకులు ఇచ్చే వారెవరో గుర్తించిన కేసీఆర్.. తర్వాత వారిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు.
తన దగ్గర పనిచేస్తున్న వారు లీకులు ఇవ్వడం.. రాధాకృష్ణ తన పేపర్లో వార్తలు రాయడంతో కెసిఆర్ తలవంచాడు. కానీ తర్వాత రాధాకృష్ణ మీద గురి చూసి దెబ్బ కొట్టాడు. ఏ లీకుల ద్వారా తనను ఇబ్బంది పెట్టాడో.. అవే లీకులు ఇచ్చి రాధాకృష్ణను క్షమాపణ చెప్పేలా చేశాడు. గత ఆదివారం రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి పేపర్ లో పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ వేయికోట్ల ఆఫర్ ఇచ్చాడు అని ప్రగతి భవన్ వర్గాల ద్వారా లీకులు ఇప్పించాడు.. దీంతో సంబరపడ్డ రాధాకృష్ణ తన పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాశాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కానీ ఇక్కడే కెసిఆర్ ప్లాన్ వర్కౌట్ అయింది..
త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని కెసిఆర్ అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా పార్టీని విస్తరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతున్నాడు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్, చంద్రబాబు మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.. ఇలాంటప్పుడు ఆ చంద్రబాబుకు ఫాయిదా చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. జగన్ తో సయోధ్య నడుస్తోంది కాబట్టి తన మాస్టర్ బ్రెయిన్ కు పదును పెట్టాడు.. ఏముంది తాను పవన్ కళ్యాణ్ కు 1000 కోట్లు ఆఫర్ ఇస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాల ద్వారా ఆంధ్రజ్యోతి ఆర్కే కు లీకులు ఇచ్చాడు. ఉబ్బి తబ్బిబయిన ఆర్కే తాను ఏదో శోధన చేసినట్టు మరింత మసాలా యాడ్ చేసి రాసుకొచ్చాడు. ఇది సహజంగానే టిడిపి క్యాంప్ మీద పెద్దదెబ్బేసింది. పవన్ కళ్యాణ్ కు చికాకు తెప్పించింది.. ఫలితంగా చంద్రబాబు ద్వారా ఆర్కే కు క్లాస్ పడింది.. అంతే కాదు దీనిని వైసిపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.. ఏకంగా రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.. అది కూడా వారం తిరగకముందే. అట్లుంటది కేసీఆర్ ప్లాన్. ఇలాంటి ఎత్తుగడల్లో కేసీఆర్.. రాధాకృష్ణ కంటే పది ఆకులు ఎక్కువే చదివాడు..
పవన్ ఆగ్రహం
రాధాకృష్ణ అడ్డగోలుగా రాయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన అంతరంగీకుల ద్వారా చంద్రబాబుకు చేరవేసినట్టు సమాచారం. ఇలా అయితే కష్టమేనని వ్యాఖ్యలు కూడా చేసినట్టు భోగట్టా.. పుట్టి మునగక ముందే చంద్రబాబు రంగంలోకి దిగాడు. రాధాకృష్ణకు లెఫ్ట్ రైట్ తీసుకున్నాడు.. ఇక అత్యంతరం లేక ఆర్కే యదార్థవాది లోక విరోధి అంటూ ఏదో రాసుకుంటూ పోయాడు.. మొట్టమొదటిసారి తనను అపార్థం చేసుకున్నారు అంటూ పత్తిత్తు కబుర్లు చెప్పాడు. సో మొత్తానికి కెసిఆర్ రాధాకృష్ణపై పై చేయి సాధించాడు. ఆ బావమరిది తో క్షమాపణ చెప్పించాడు.