
విదేశాల్లో ఉన్న భారతీయులను దేశానికి తీసుకువచ్చేయందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్. ఈ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో ఉన్న తెలుగువారిని రేపటి నుంచి రాష్ట్రానికి తీసుకురానున్నారు. దీంతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలు వందే భారత్ మిషన్ విమానాలు రానున్నాయి. అదేవిధంగా మరికొందరు చెన్నయ్, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలకు రానున్నారు. లాక్ డౌన్ కారణంగా మూసి ఉన్న విమానాశ్రయాల్లో ఇందుకు సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదిక ఆధారంగా వారిని క్వారంటైన్, కోవిడ్ ఆసుపత్రికి పంపించాలనే అంశాలపై ఒక నిర్ణయానికి వస్తారు.
మరోవైపు విదేశాల నుంచి తెలుగువారి రాకపై ముఖ్యమంత్రి జగన్ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు అందించడానికి ఏర్పాట్లుపై అధికారులను ప్రశ్నించారు. విమానాశ్రయాల నుంచి క్వారంటైన్ కేంద్రాలకు చేరడానికి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలన్న ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి వస్తున్నవారికి ఏ రాష్ట్రం కూడా ఇంతలా సదుపాయాలను ఏర్పాటు చేయడంలేదని అధికారులు సీఎంకు వివరించారు.