
YS Viveka Second Wife: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త కోణం బయటపడిందా? కేసు తుది విచారణకు వస్తున్న తరుణంలో ఆయన రెండో భార్య ఇష్యూ బయటకు రావడం దేనికి సంకేతం? ఇందులో వాస్తవం ఉందా? లేకుంటే కేసును పక్కదారి పట్టించేందుకు కొత్త ఎత్తుగడ? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ రాని వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలమంటూ ఆమె తరుపు లాయర్ మీడియాకు ఓ రిపోర్టును పంపారు. అందులో వివేకా హత్య చుట్టూ ఆర్థిక పరమైన అంశాలే ప్రభావితం చూపాయని..కుమార్తె, బావమరిదిని టార్గెట్ చేస్తూ వాంగ్మూలం ఇచ్చినట్టుగా అర్ధమవుతోంది. దీనినే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా హైప్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివేకాతో రెండుసార్లు పెళ్లి..
షమీమ్ వెల్లడించిన రికార్డులో తమ వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చారు. తనకు వివేకాతో 2010లో వివాహం జరిగిందని చెప్పారు. కానీ 2011లో రెండోసారి పెళ్లి చేసుకున్నట్టు వివరించారు.
2015లో తమకు షహన్ షా పుట్టారని సీబీఐకి తెలిపింది. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు షమీమ్ తెలిపారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె తెలిపారు. వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు బెదిరించారని ఆమె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే ఎక్కడా ఆమె మీడియా ముందుకు రాలేదు.
ఆమె వివేకా ఆస్తుల కోసం రేపోమాపో కోర్టులో పిటిషన్ వేయబోతున్నారన్న ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ఉధృతం చేస్తున్నాయి.
వారిపైనే ప్రధాన ఆరోపణలు..
వివేకా కుమార్తె సునీత నుంచి తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని.. వివేకాకు దూరంగా ఉండాలని ఆమె తరచూ హెచ్చరించేదని షమీమ్ వెల్లడించారు. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్, వివేకా పదవిపై శివప్రకాశ్ రెడ్డి కన్నేశారని షమీర్ ఆరోపించారు. తమ కొడుకు షహన్ షా పేరు మీద 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నా.. శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని ఆమె వివరించారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని ఆమె ఆరోపించారు. చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని షమీమ్ తెలిపారు. బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పాడని.. హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్లు గురించి ఆయన తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చనిపోయిన తరువాత వివేకా ఇంటికి వెళ్దామనుకున్న.. శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో అటు వైపు వెళ్లలేకపోయానని షమీమ్ ఆ రికార్డుల్లో పేర్కొన్నారు. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి. వివేకా హత్య కేసులో మున్ముందు షమీమ్ ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పలు అనుమానాలు
అయితే ఇన్నాళ్లూ తెరపైకి రాని షమీమ్ వ్యవహారం ఇప్పుడే బయటపడడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. కేసును పక్కదారి పట్టించేందుకేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేసు విచారణలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ నెల 30లోగా పూర్తిచేయాలన్న కసితో పనిచేస్తోంది. అటు సెలవు దినాల్లో సైతం విచారణను కొనసాగిస్తోంది. ఇటువంటి తరుణంలో షమీమ్ వ్యవహారం బయటకు రావడం, అది మీడియాకు వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై కూడా సీబీఐ స్పష్టతనిచ్చే చాన్స్ ఉంది. ఇప్పటికే తుది విచారణ దశకు అడుగుపెడుతున్న వేళ ఇటువంటి ఇబ్బందులు వచ్చినా పట్టించుకునే ప్రసక్తే లేదని సీబీఐ వర్గాలు తేల్చిచెబుతున్నట్టు తెలుస్తోంది.