Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం. కేసులో కీలక నిందితుడు ఒకరు అప్రూవర్ గా మారారు. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇది సంచలనం గా మారింది. కేసు మరో మలుపు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ దక్కించుకున్నారు. ఈనెల 28 వరకు ఆయన బెయిల్ గడువు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేసులో ఓ నిందితుడు అప్రూవర్ గా మారేందుకు ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మొత్తం 37 మంది నిందితులను సిఐడి చూపింది. ఇందులో ఏ 13 నిందితుడిగా సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా ఉన్నారు. ఇప్పటికే ఆయన్ను సిఐడి అరెస్టు చేసింది. బెయిల్ పై బయట ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అప్రూవర్ గా మారడం విశేషం. ఏకంగా ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 5న నేరుగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టుకు పూర్తి వివరాలు తెలిపేందుకే ఈయన పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఎటువంటి అవకతవకలు జరగలేదని సీ మెన్స్ సంస్థ చెబుతోంది. పూర్తిగా నిబంధనలకు లోబడి ఈ ప్రక్రియ జరిగిందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
అసలు చంద్రబాబుకు ఈ కేసుతో సంబంధం లేదని ఆయన తరుపు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేసులో నిందితుడు అప్రూవర్ గా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబుకు నేరుగా ముడుపులు అందాయని సిఐడి చెబుతున్నా.. అందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. అప్రూవర్ గా మారిన చంద్రకాంత్ షా చెప్పే మాటలతో కోర్టు ఏకీభవిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి విచారణ అనంతరం ఎవరెవరి పేర్లు బయట పడతాయోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.