Amaravati: అమరావతే ఏకైక రాజధాని అని రైతులు ఒకవైపు.. మూడు రాజధానులంటూ వైసీపీ సర్కారు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ల విషయంలో ట్విట్ల పరంపర కొనసాగుతోంది. ఈ పిటీషన్లు అన్నింటిపై ఏకకాలంలో విచారణ కొనసాగిస్తామని గతంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయితే వీటి విచారణ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్ తప్పుకోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు మరో బెంచ్ ఏర్పాటుచేసి విచారణకు సిద్ధమవుతోంది. అయితే ఇక్కడే మరో ట్విస్టు. అటు అమరావతి రైతులు, ఇటు వైసీపీ సర్కారు పిటీషన్లతో పాటు.. 2014లో రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై సైతం విచారణ చేపట్టనున్నారు. రాజధాని ఇష్యూతో విభజన హామీలకు లింక్ ఉన్నందున వీటిన్నింటిపై సమగ్రంగా విచారించి తుది తీర్పు వెలువరించాలని అత్యున్నత న్యాయస్థానం భావిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లోగా దీనిపై వచ్చే తీర్పు రాజకీయాలపై పెను ప్రభావం చూపే అవకాశముంది.

అమరావతే ఏకైక రాజధాని అని ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆరు నెలల్లో అమరావతిలో మౌలిక వసతులు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ వైసీపీ సర్కారు రకరకాల కారణాల చూపుతూ అమరావతిలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. తీరా హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసేసరికి వైసీపీ సర్కారు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. అది ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే ఒక వేళ హైకోర్టు తీర్పును ఏపీ సర్కారు సవాల్ చేస్తే.. తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని రాజధాని రైతులు ముందుగానే పిటీషన్లు దాఖలు చేశారు. అయితే ఇరువర్గాల పిటీషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ ప్రకటించారు. అయితే ఈ విషయంలో న్యాయవాదుల అభ్యంతరాలు, 2014లో రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం చెప్పి ఉన్న నేపథ్యంలో జస్టిస్ లలిత్ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. దాని కోసం మరో బెంచ్ ఏర్పాటుచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. మరోవైపు 2014లో రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై కూడా విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఈ వరుస పిటీషన్లపై విచారణలో అనేక చిక్కుముళ్లు ఎదురయ్యే అవకాశముంది.

గతంలో విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ 36 రిట్ పిటీషన్లు దాఖలయ్యాయి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా 36 మంది పిటీషన్లు వేశారు. వీటన్నింటిపై కోర్టులోవిచారణ కొనసాగనుంది. అప్పట్లో వేసిన పిటీషన్లపై అడపాదడపా విచారణలు జరుగుతున్నాయే తప్ప… రెగ్యులర్ గా జరగడం లేదు. దీంతో ఇప్పుడు విభజన హామీగా భావిస్తున్న రాజధానిపై విచారణ చేపడుతుండడంతో పనిలో పనిగా వాటి పనిని తేల్చేయ్యాలని న్యాయమూర్తులు భావిస్తున్నారు. అయితే నేరుగా సుప్రీం కోర్టు తీర్పు వస్తుందని భావించిన వారు ట్విట్లు కొనసాగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. తుది తీర్పు మాత్రం తమకు అనుకూలంగా వస్తుందని అటు అమరావతి రైతులు.. ఇటు ఏపీ సర్కారు ఎవరి అభిప్రాయంతో వారు ఉన్నారు.