PM Modi Visakha Tour- Pawan Kalyan: ఏపీలో ప్రధాని మోదీ పర్యటనను వైసీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపనకుగాను ప్రధాని మోదీ ఈ నెల 11 న వస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన విశాఖలోనే ఉండనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాలకు హాజరుకానున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వపరంగా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను వైసీపీ సర్కారు చూస్తోంది. దీనినే అడ్వాంటేజ్ గా అధికార పార్టీ నాయకులు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి రివ్యూలు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకులకు సమాచారం లేకపోవడం ఆ పార్టీలో విస్మయం వ్యక్తమవుతోంది. అటు ప్రధాని సభ ఉంటుందని వైసీపీ నేతలే ప్రకటిస్తున్నారు. దాదాపు లక్షమంది జనాభాను సమీకరించాలని అధికారులకు టార్గెట్లు ఇచ్చారు. ప్రధాని బీజేపీకి చెందిన వ్యక్తి.. ఆపై జనసమీకరణ చేస్తే గీస్తే తాము చేయాలని కాషాయ దళం చెబుతోంది. బీజేపీ కోర్ కమిటీలో సైతం ఇదే అంశం చర్చకు వచ్చింది. గతంలో అల్లూరి విగ్రహావిష్కరణలో ఎదురైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్ణయించారు.

నాటి విగ్రహావిష్కరణకు ప్రధాని హాజరయ్యేటప్పుడు జగన్ అండ్ కో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అటు టీడీపీ తరుపున హాజరైన అచ్చెన్నాయుడుకు అవమానించారు కూడా. దీనిపై మంత్రి కిషన్ రెడ్డి చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నాడు విగ్రహాన్ని ఏర్పాటుచేసింది క్షత్రియ సమాజం. కానీ క్షత్రియ వర్గానికి చెందిన లోకల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు దూరం పెట్టారు. అటు పవన్ ను ఇరుకున పెట్టేందుకు చిరంజీవిని తెరపైకి తెచ్చారు. కానీ నాటి రాజకీయ పరిస్థితులను క్యాష్ చేసుకొని ప్రధాని టూర్ షెడ్యూల్ ను జగన్ సర్కారు మార్పులు చేర్పులు చేసింది. ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి ఉండకుండా బీజేపీ నేతలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు ప్రధాని కార్యాలయంతో పాటు బీజేపీ హైకమాండ్ పెద్దలు కూడా స్వయంగా పీఎం టూర్ ను పర్యవేక్షిస్తోంది.
ముఖ్యంగా పవన్ ను సాదరంగా ఆహ్వానించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల తరువాత బీజేపీతో జనసేన మిత్రపక్షంగా నడుస్తోంది. కానీ ఎన్నడూ పవన్ ప్రధానితో కలిసి వేదిక పంచుకునేందుకు తహతహలాడలేదు. ఎటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలకు ఆశించి కేంద్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న ప్రధాని మోదీతో స్నేహం కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల జాతీయ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ వైసీపీ సహకారం తీసుకుంటూ వచ్చింది. దానినే వైసీపీ అలుసుగా తీసుకుంది. తాము ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా కేంద్రం వద్ద తమ మాట చెల్లుబాటు అవుతోందని వ్యవహరిస్తూ వచ్చారు. అయితే దీనిని నిఘా సంస్థలు గ్రహించి కేంద్రానికి చేరవేశాయి. అందుకే కేంద్ర పెద్దలు జాగ్రత్త పడ్డారు. ప్రధాని విశాఖ పర్యటనకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రోటోకాల్ పరంగా రాష్ట్ర ప్రభుత్వ సాయం తీసుకుంటూనే తన మిత్రుడు పవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఒక వేళ బీజేపీ నేతల విన్నపాన్ని మన్నించి పవన్ ప్రధాని సమావేశానికి హాజరైతే కచ్చితంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీ టూర్లతో గడిపిన జగన్ రాష్ట్రానికి సాధించిందేదీ లేదు. తనపై ఉన్న కేసులు, రాజకీయ ప్రయోజనాలకే పరిమితమయ్యారన్న అపవాదు ఆయనపై ఉండిపోయింది. ప్రస్తుతం ప్రధాని విశాఖ వస్తున్నారు కనుక… విశాఖ కేంద్రంగా ఉన్న స్టీల్ ప్లాంట్, ప్రత్యేకరైల్వేజోన్ వంటి వాటిని ప్రస్తావించి వాటికి మోక్షం కలిగించేలా చేయగల శక్తి పవన్ కు ఉందని రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. ఒక వేళ కేంద్ర పెద్దల నుంచి ఆహ్వానం అందితే మాత్రం పవన్ తప్పకుండా హాజరుకావాలని కోరుకుంటున్నారు.