Gujarat Polls : దేశంలోని నంబర్ 1, 2ల సొంత రాష్ట్రం గుజరాత్. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. అందుకే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు గుజరాత్ లో అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన ప్రాజెక్టులు, నిధులు అన్నింటిని గుజరాత్ కు తరలించేసి అభివృద్ధి చేస్తున్నారు. మోడీ సీఎంగా గద్దెనెక్కిన 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా గుజరాత్ ను బీజేపీనే పాలించింది. మోడీ ప్రధాని అయ్యాక కూడా రెండు సార్లు బీజేపీనే గెలిచింది. కానీ ఈసారి మాత్రం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ కాచుకొని కూర్చుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బలంగా పుంజుకుంది. సో గుజరాత్ లో ఈసారి గెలవడం మోడీ-షాలకు అంత ఈజీ కాదు.

యావత్ దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్ర శాసనసభకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం షెడ్యూల్ ను ప్రకటించింది. కేవలం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది.
డిసెంబర్ 1న తొలిదశ పోలింగ్, డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ ను గుజరాత్ లో నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతోపాటే గుజరాత్ రాష్ట్రానికి కూడా డిసెంబర్ 8నే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలి దశలో 89 స్థానాలకు, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 4.9 కోట్ల మంది ప్రజలు ఓటు వేయనున్నారు. 51వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
-2017 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ
2017 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. మోడీ హయాం నుంచి ఇప్పటిదాకా బీజేపీనే గుజరాత్ ను పాలిస్తోంది. మరోసారి వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రం అంత ఈజీ కాదని అంటున్నారు. కొన్నేళ్లుగా గుజరాత్ లో బీజేపీ గెలుపు.. సీఎంలను మార్చడం.. పటేల్ సామాజికవర్గంలో అసంతృప్తి.. కాంగ్రెస్ పై సానుభూతి, క్యాష్ చేసుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేపథ్యంలో ఈ సారి బీజేపీ గెలుపు కష్టమేనంటున్నారు. గుజరాత్ లో త్రిముఖ పోరు నెలకొంది.
ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ నవంబర్ 12న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ చేపడుతారు. ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకున్నా సాధ్యపడలేదు. ఎట్టకేలకు ఈసీ తేదీలు ప్రకటించింది.