Supreme Court: పెళ్లంటే గానా, బజానా, కట్నాలు, కానుకలు కాదు.. తలంటిన సుప్రీంకోర్టు

"హిందూ వివాహం అంటే విందులు, వినోదాలు, కట్నాలు, కానుకలు కాదు. అది లోతైన ఆచారంతో ముడిపడి ఉన్న బంధం. వివాహ ప్రక్రియ అనేక కట్టుబాట్లతో కూడి ఉంది. హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే ఆచారాలను పాటించాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 2, 2024 9:07 am

Supreme Court

Follow us on

Supreme Court: వారిద్దరు పైలెట్లు.. ఇద్దరూ విద్యాధికులే. ప్రేమించుకున్నారు, కొంతకాలం సహజీవనం చేశారు, అనంతరం పెళ్లి చేసుకున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు కనిపించిన ఆప్యాయత, పెళ్లి తర్వాత మాయమైంది. పరస్పరం గౌరవించుకోవాల్సిన స్థానంలో అహం పెరిగిపోయింది. భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. దీంతో వారు కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నారు. ఇద్దరికీ ఆర్థిక స్థిరత్వం ఉండడంతో విడాకులు తీసుకోవాలని భావించారు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.. దీంతో వారి కేసు బుధవారం విచారణకు వచ్చింది. ఈ కేసును జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మహిహ్ ఆధ్వర్యంలో ధర్మాసనం విచారణ చేపట్టింది.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

విందులు, వినోదాలు మాత్రమే కాదు

“హిందూ వివాహం అంటే విందులు, వినోదాలు, కట్నాలు, కానుకలు కాదు. అది లోతైన ఆచారంతో ముడిపడి ఉన్న బంధం. వివాహ ప్రక్రియ అనేక కట్టుబాట్లతో కూడి ఉంది. హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే ఆచారాలను పాటించాలి. సప్తపది (పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడూ అడుగులు) వంటి దానిని ఆచరించాలి. వివాహ వ్యవస్థలో వివాదాలు చోటుచేసుకున్నప్పుడు.. ఆ సమయంలో సప్తపది రుజువుగా ఉంటుంది.. ఎటువంటి క్రతువులు నిర్వహించకుండా.. హిందూ వివాహం చేసుకున్నామని చెప్పడం సరైనది కాదు.. మత కర్మను పాటించకుండా, హిందూ వివాహ వ్యవస్థ గురించి తెలుసుకోకుండా, ఆ విధానంలో పెళ్లి చేసుకుందామని చెప్పడం సరైన పద్ధతి కాదు. హిందూ వివాహం అనేది గొప్ప కార్యక్రమం.. ఇది స్త్రీ, పురుషులకు గౌరవప్రదమైన హోదాను మరింత పెంచుతుంది. దీని ద్వారా వారు తమ కుటుంబాన్ని పెంపొందించుకుంటారు. ఇది వారికి ఉన్నతిని కలగజేస్తుంది. తదుపరిగా తమ కుటుంబాన్ని విస్తరించుకునేందుకు బలంగా తోడ్పడుతుందని” ధర్మాసనం పేర్కొంది.

చెల్లుబాటు కావాలంటే..

“హిందూ వివాహ చట్టంలో సెక్షన్ 7 అనేది ఒకటుంది.. పెళ్లి వేడుక హిందూ ఆచారం ప్రకారం జరిగితేనే చెల్లుబాటు అవుతుంది. అలా పెళ్లి చేసుకోకుండా.. పైగా విడాకుల కోసం కోర్టుకు వచ్చిన వారిని మేము భార్యాభర్తలుగా పరిగణించలేం.. దీనిని మేము వ్యక్తుల మధ్య జరిగిన సంబంధం గానే పరిగణిస్తాం. హిందూ వివాహం అనేది వ్యాపార లావాదేవి కాదు. బలవంతమైన కట్నాల ఒత్తిడికి పాల్పడే చర్య అస్సలు కాదు. హిందూ వివాహంలో బెటర్ ఆఫ్ అనే పదం లేదు. ఆ ప్రక్రియలో భార్యాభర్తలు సమాన అర్ధ భాగాలు. హిందూ వివాహ చట్టం బహు భార్యత్వాన్ని, బహు భర్తత్వాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అలాంటి వ్యవస్థలో నిబంధనలను పాటించాలి. అంతేతప్ప ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని” జస్టిస్ నాగరత్న, జస్టిస్ జార్జ్ మహిహ్ తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ ఇద్దరు పైలట్ల జంటకు సంబంధించిన విడాకుల కేసును వాయిదా వేసింది.