SRH Vs RR: సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు.. రాజస్థాన్ తో ఆడే జట్టు ఇదే

ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలవాలి. అందువల్ల రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని కమిన్స్ ఆధ్వర్యంలో ఆరెంజ్ ఆర్మీ గట్టి పట్టుదలతో ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 2, 2024 9:32 am

SRH Vs RR

Follow us on

SRH Vs RR: ప్రస్తుత ఐపిఎల్ లో మొన్నటిదాకా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగిన హైదరాబాద్ జట్టు.. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో టేబుల్ లో ఐదవ స్థానానికి దిగజారింది. ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లాలంటే వచ్చే మ్యాచ్ లలో విజయం సాధించాలి. ఇందులో భాగంగా సొంత మైదానంలో గురువారం బలమైన రాజస్థాన్ రాయల్ జట్టుతో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలుపు హైదరాబాద్ కు అత్యంత కీలకం.

ఈ సీజన్లో సంచలన బ్యాటింగ్ తో హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుతాలు చేశారు. కానీ గత రెండు మ్యాచ్లలో దారుణమైన ఆటతీరు ప్రదర్శించి ఓడిపోయారు. బెంగళూరు చేతిలో 38, చెన్నై చేతిలో 78 రన్స్ తేడాతో వరుసగా రెండు పరాజయాలను నమోదు చేసుకున్నారు. వాస్తవానికి చేజింగ్ విషయంలో హైదరాబాద్ ఆటగాళ్లు విపరీతమైన అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఒత్తిడిలో వెంటవెంటనే వికెట్లను సమర్పించుకుంటున్నారు.

ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలవాలి. అందువల్ల రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని కమిన్స్ ఆధ్వర్యంలో ఆరెంజ్ ఆర్మీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో విక్టరీని అందుకొని ప్లే ఆఫ్ సమరంలో బలమైన అడుగులు వేయాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సీజన్లో టేబుల్ టాపర్ గా రాజస్థాన్ జట్టు కొనసాగుతోంది. ప్లే ఆఫ్ ఆశలను దాదాపు ఖాయం చేసుకుంది. హైదరాబాద్ జట్టును ఓడించి అధికారికంగా ప్లే ఆఫ్ చేరాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.

హైదరాబాద్ జట్టుకు రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకంగా కావడంతో.. పలు మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఆటగాడు మార్క్రం పై వేటు వేసింది. కొంతకాలంగా అతని ఆట తీరులో నిలకడలేమి కనిపిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన అతను 18, 42*, 17, 50*, 0, 32*, 1, 7, 32 లతో 207 రన్స్ చేశాడు. ఇంతవరకు బౌలింగ్ చేయలేదు. దీంతో అతడిని పక్కనపెట్టి ఆల్రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ ను తీసుకోవాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. మరోవైపు మయాంక్ మార్కండే కు సైతం అవకాశం ఇచ్చేందుకు సమాయత్తవుతున్నది. ఇక నటరాజన్, హెడ్ లలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే అవకాశం ఉంది.

హైదరాబాద్ జట్టు అంచనా ఇలా

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రం/ గ్లేన్ ఫిలిప్స్, క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్/ వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే.