
తను శవమై
ఒకరికి వశమై
తనువు పుండై
ఒకరికి పండై
ఎప్పుడూ ఎడారియై
ఎందరికో ఒయాసిస్ అయి
అని వేశ్యల జీవితాల్లో బాధలను ఆవిష్కరించిన గొప్ప వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. ఆరోగ్యం సహకరించకపోయినా విలువలే పెట్టుబడిగా జీవించిన తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఏనాడూ వదలలేదు. చావుకు దగ్గరవుతున్నా తనలోని ఆత్మాభిమానాన్ని తక్కువ చేయలేదు. సినిమా రంగంలో రాణించాలని అగ్ర దర్శకుడు టి.కృష్ణ ఇచ్చిన ఆహ్వానాన్ని సైతం తిరస్కరించాడు. నైతికతకే పెద్దపీట వేస్తూ సమాజంలో జరిగే పలు విషయాలను తన కలంతో వెలుగులోకి తెచ్చాడు.
ఏ కీలుకాకీలు విరిసేవాడు వకీలు అన్నా ఆయనకే చెల్లు. సెక్స్, క్రైం కవలలు కలిపి చదివితే నవలలు అన్నా ఒప్పుకోవాల్సిందే. రోజుకు రెండుసార్లు ప్రసవించే పోస్ట్ బాక్సు తల్లికి కోకొల్లలు ఉత్తరాల పిల్లలు అంటూ వ్యంగ్యాస్తాలు విసిరినా ఆయనకే సొంతం. పేద దేశాలను తారుపోసి చదును చేసే రోలర్ డాలర్ అంటూ కరెన్సీని గురించి చెప్పారు. చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టేచుట్టూరా అరణ్యమై భయపెడుతుంది. గుండెంటూ కలిగి ఉంటే నీ వెంట అదే సైన్యమై నిలుస్తుంది అని పిరికివారికి ధైర్యం బోధించారు.
అలిశెట్టి ప్రభాకర్ అక్షర సైనికుడిగా మారి తెలుగు భాషకు ఎనలేని కీర్తి తెచ్చారు. నగర జీవితం నుంచి నరకం వరకు తనదైన శైలిలో వినూత్నంగా కవితలు రాసి పలువురిని మెప్పించిన ఘనత ఆయనకే సొంతం. పదాల కేళితో వైకుంఠపాళి ఆడిన ప్రతిభాశాలి. తెలుగు కీర్తి కిరీటాన్ని ఖండాంతరాలు దాటించి భాషాభిమానానికి సేవలందించిన ధీశాలి. భాషాభ్యుదయానికి బాటలు వేసిన అనితరసాధ్యుడు ప్రభాకర్. జగిత్యాల ముద్దుబిడ్డగా అందరికీ సుపరిచితడైనా హైదరాబాద్,కరీంనగర్ లాంటి నగరాల్లో కూడా తాను కొంత కాలం జీవించిన అలిశెట్టి మార్గం. అనుసరణీయం. అనిచర్వనీయం. అనితరసాధ్యం.అనుమానం.