Tragic Deaths of Young Pilots: భారత సైన్యంలో ఎయిర్‌ఫోర్స్ ఎంతో కీలకమైనది. మారుతున్న యుద్ధ రీతులతో ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్ ప్రాధాన్యత పెరిగింది. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్, ఇటీవల పహల్గాం ఉగ్రదాడకి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో నేవీ,ఎయిర్‌ఫోర్స్ కీలకంగా వ్యవహరించాయి. అయితే యుద్ధాల్లో మరణించిన వారిని వీరుడు అంటారు. కానీ, మన పైలట్లు.. యుద్ధం చేయకండానే దుర్మరణం చెందుతున్నారు. ఇటీవలి శిక్షణ విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలల్లో జాగ్వార్, మిరాజ్ వంటి యుద్ధ విమానాలు కూలిపోవడంతో సుశిక్షిత పైలట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. 2017–2022 మధ్య 20 యుద్ధ విమానాలు, ఏడు హెలికాప్టర్లు, ఆరు శిక్షణ విమానాలు, ఒక కార్గో విమానం కూలినట్టు ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక పోస్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాత విమానాలు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) నిర్వహణ, శిక్షణ సమస్యలపై కీలక చర్చను లేవనెత్తుతోంది.
పాత విమానాలతో ప్రమాదాలు..
మిగ్–21 విమానాలు భారత వైమానిక దళంలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1963లో ఇంపోర్ట్‌తో ప్రారంభమై, నాసిక్‌లోని హెచ్‌ఏఎల్ వద్ద అసెంబుల్ చేయబడిన ఈ విమానాల ఉత్పత్తి 1985లో నిలిచిపోయింది. అయినప్పటికీ, ఈ 40 ఏళ్ల పాత విమానాలను అవియానిక్స్ అప్‌డేట్‌లు, నిర్వహణతో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఈ విమానాలు శిక్షణ సమయంలో జరిగిన టెస్ట్ ఫ్లైట్‌లలో అనేకసార్లు కూలిపోయాయి, దీని వల్ల 170 మంది సుశిక్షిత పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో పైలట్‌ను శిక్షణ ఇచ్చి, యుద్ధ విమానాన్ని నడపగలిగే స్థాయికి తీసుకురావడానికి దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అయినప్పటికీ, ఈ విమానాలను 2025 డిసెంబర్ వరకు సర్వీసు నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకోవడం, నిర్వహణలో ఆలస్యాన్ని సూచిస్తుంది.
జాగ్వార్ విమానాల్లో సమస్యలు..
మిగ్–21ల స్థానంలో జాగ్వార్ విమానాలు వస్తున్నాయి, కానీ ఇవి కూడా 1979లో ఇండక్ట్ అయిన పాత విమానాలే. హెచ్‌ఏఎల్ నిర్మించిన ఈ విమానాలు కూడా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు యువ పైలట్లు మరణించారు, ఇది జాగ్వార్ విమానాల నిర్వహణ, ఆధునీకరణ సమస్యలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఐదు నెలల్లో మూడు జాగ్వార్ విమానాలు కూలిపోవడం, వీటి వయస్సు, నిర్వహణలో లోపాలను సూచిస్తోంది.
Also Read: ఢిల్లీలో పెనుభూకంపం.. ఏంటీ ఉపద్రవం.. ఎందుకిలా?
హెచ్‌ఏఎల్‌పై విమర్శలు..
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) భారత్‌లో వైమానిక రంగంలో కీలక సంస్థగా ఉన్నప్పటికీ, దాని నిర్వహణ, ఉత్పత్తి నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమ పోస్టులో హెచ్‌ఏఎల్‌ను ‘హిందుస్థాన్ ఆముదం లిమిటెడ్‘ అని వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. సంస్థపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది. హెచ్‌ఏఎల్ వద్ద తయారైన విమానాలు తరచూ నిర్వహణ సమస్యలతో బాధపడుతున్నాయి, ఇది ప్రమాదాలకు ఒక కారణంగా చెప్పబడుతోంది. అదనంగా, 5వ తరం యుద్ధ విమానాలను తయారు చేస్తామని చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శిక్షణలో లోపాలు..
విమాన ప్రమాదాలు ఎక్కువగా శిక్షణ సమయంలో జరగడం ఆందోళనకరం. యుద్ధాల కంటే శిక్షణలోనే ఎక్కువ మంది పైలట్లు ప్రాణాలు కోల్పోవడం, శిక్షణ ప్రక్రియలో లోపాలను సూచిస్తుంది. పాత విమానాలను ఉపయోగించడం, సరైన నిర్వహణ లేకపోవడం, ఆధునిక శిక్షణ సౌకర్యాల కొరత వంటివి ఈ సమస్యలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒక్కో పైలట్ శిక్షణకు భారీ ఖర్చు చేస్తున్నప్పటికీ, ఈ ప్రమాదాలు ఆర్థిక, మానవ నష్టాలను కలిగిస్తున్నాయి.