2000 Note Withdrawal: ఆరు సంవత్సరాల క్రితం పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. నల్లధనం నియంత్రణ కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ప్రధానమంత్రి ప్రకటించడం పట్ల దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. కానీ అందుకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకపోవడంతో దేశ ప్రజలకు కరెన్సీ కష్టాలు ఏమిటో కళ్ళ ముందు కనిపించాయి. నోట్ల కోసం బ్యాంకుల ఎదుట బారులు తీరిన విధానాన్ని ఇప్పటికీ దేశ ప్రజలు మర్చిపోలేరు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం నియంత్రణ ఏమిటో గాని తమని మాత్రం తీవ్రంగా కష్టాలపాలు చేసిందని సామాన్యులు, వ్యాపారులు ఇప్పటికీ చెబుతుంటారు.
మళ్లీ గాడిన పడలేదు
ఒకరకంగా పెద్ద నోట్లు రద్దు దేశ ఆర్థిక రంగానికి తీవ్రమైన చేటు తెచ్చింది. 2015_16 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధిరేటు నమోదయింది. మళ్లీ ఆ స్థాయిలో వృద్ధిరేటు సాధించలేకపోయింది. పెద్ద నోట్లు రద్దుచేసిన మూడు సంవత్సరాల లో వృద్ధిరేటు 6.1 శాతానికి దిగజారి పోయింది.. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా వరకు షెల్( ఊరు పేరు లేనివి) కంపెనీలు మూతపడ్డాయి. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా మూతపడ్డాయి. పెద్ద నోట్లు ఇబ్బడి ముబ్బడిగా డిపాజిట్ కావడంతో బ్యాంకులు రుణ వితరణ పెంచి మొండి బకాయిలు పోగు చేసుకున్నాయి. దేశంలో మొత్తం వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్ పీ ఏ( నాన్ పేర్ఫామెన్స్ అసెట్స్) లు 7.5% నుంచి 11.2% చేరాయి.
రూపాయి నిలువునా కూలిపోయింది
అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా ప్రతిబంధక పరిస్థితుల వల్ల రూపాయి నిలువునా కూలిపోయింది. ధరలు భారీగా పెరిగాయి. రెండు సంవత్సరాలలో రూపాయి విలువ 12 శాతం పతనమైంది. అయితే ఇప్పుడు ఈ 2000 నోటు ఉపసంహరణ కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకంపనులు శుక్రవారం రాత్రి నుంచే విదేశీ మార్కెట్లో కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ తిరిగి ఆల్ టైం కనిష్ట స్థాయిని సమీపించింది. మన ఫారెక్స్ మార్కెట్లో 82.67 వద్ద ముగిసిన రూపాయి 2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన తర్వాత 82.90 స్థాయికి పడిపోయింది.
పడికాపులు కాయాల్సిందే
రెండు లక్షల రూపాయల వరకు నగదును తమ వద్ద ఉంచుకోవచ్చు అంటూ ప్రజలకు అనుమతి ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..ఇప్పుడు మరో కఠిన షరతు విధించింది. ఒక రోజులో కేవలం 20,000 మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే రెండు లక్షలు మార్చేందుకు పది రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే. ఎంతోమంది తమ అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో కాకుండా ఇళ్లల్లో నగదు ఉంచుకుంటారు. 2000 నోట్లు అయితే తక్కువ పరిణామం అయినందున అవసరాలకు వాటిని అంటిపెట్టుకునే వారు ఎందరో ఉన్నారు. జరుగు బ్యాంకు నిర్ణయంతో వారికి రెండు లక్షల అవసరం తీరాలంటే పది రోజుల పాటు బ్యాంకు శాఖల ముందు, క్యాష్ డిపాజిట్ మిషన్ల ముందు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016లో ఇదే తరహాలో పెద్ద నోట్లు రద్దు ప్రకటించిన సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.