రాష్ట్రంలో కరోనా వైరస్ భారిన పడుతున్న వారిలో సుమారు 10 శాతం మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి కోవిడ్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న 475 క్రియాశీల కేసుల్లో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా 3 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల వారని అధికారులు తెలిపారు.
మార్చిలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లగి జమాత్ సమావేశానికి హాజరైన కుటుంబ సభ్యుల నుంచి పిల్లలందరికీ వైరస్ సోకిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జమాత్ నుంచి తిరిగి వచ్చిన వారిలో చాలా మంది వారికి వైరస్ సోకినట్లు గుర్తించలేకపోయారు. దీంతో వారు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటంతో కుటుంబ వారికి వైరస్ సోకింది. ఈ విధంగా వైరస్ భరినపడిన వారిలో 124 మంది మహిళలు ఉన్నారు. కొన్ని ఘటనల్లో కుటుంబంలోని మహిళా సభ్యులందరూ వైరస్ బారిన పడ్డారు. వీరిలో 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 36 మంది ఉన్నారు.
ఇటీవల గుంటూరులో ఒక వృద్ధునికి పాజిటివ్ అని పరీక్షలలో తేలింది. అతనిని కోవిడ్ కేంద్రానికి తరలించారు. అతని మనుమడు వృద్ధుని వద్దే ఉన్నాడు. చీరాల నుంచి అతని అల్లుడు వచ్చి పిల్లవాడిని తీసుకు వెళ్ళాడు, ఈ విషయం తెలుసుకున్న చీరాల పోలీసులు ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసి పిల్లవాడిని, ఆ వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు.
రాష్ట్రంలో ట్రూనాట్ టిబి పరీక్షా పరికరాలను ఉపయోగించి రోజుకు 4,000 పరీక్షలను నిర్వహించాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే వారం నుంచి రోజుకు 17 వేల నమూనాలను పరీకించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. క్వారంటైన్ కేంద్రాల నుండి ఇంటికి వెళ్ళే పేద కుటుంబాలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
మరోవైపు తెలంగాణా రాష్ట్రంలో 25 మంది చిన్నారులు వైరస్ బారినపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. వీరిలో కొందరు హైదరాబాదుకు చెందినవారు, మరికొందరు వివిధ జిల్లాలకు చెందిన వారు చికిత్స కోసం ఇక్కడికి తీసుకువచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రావణ్ కుమార్ చెప్పారు.
చిన్నారుల్లో వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉందని, తేలికపాటి లక్షణాలు మాత్రమే కలిగి ఉన్నారని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, త్వరలో వీరిని ఆసుపత్రుల నుంచి ఇళ్లకు పంపడం జరుగుతుందని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల అధికారులు చెపుతున్నారు.