టీఆర్ఎస్కు ఎప్పటికైనా తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలకు అసలు పరీక్ష మొదలైంది. మరో నెల రోజుల్లో గ్రేటర్ ఎన్నికల జరుగనుండడంతో పార్టీలో హడావిడి కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దేశంలోని బిహార్ రాష్ట్రంతోపాటు ఖాళీ ఉన్నస్థానాలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. వీటి తదుపరి రాష్ట్రంలోని కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలంతా ఇప్పుడు జీహెచ్‌ఎంసీ మీదనే దృష్టి సారించాయి. ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నాయి.
Also Read: తెలంగాణ మళ్లీ టాప్.. గొప్ప విజయం
గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకున్న మంత్రి కేటీఆర్ నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండొచ్చని.. సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే.. గత ఎన్నికల్లో 99 సీట్లు సాధించి తొలిసారి బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగురవేశారు. ఈ సారి పక్కా సెంచరీ కొడుతామని ధీమా అధికార పార్టీలో కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌లో నాయకత్వ మార్పులపై ఊహాగానాలు వస్తుండడంతో కేటీఆర్‌కు ఈ ఎన్నికలు రెఫరెండంలా మారాయి. తిరుగులేని విజయం సాధిస్తే కేటీఆర్‌కు మార్గం సుగమం అయినట్లే అని చెప్పొచ్చు.
అయితే.. అప్పటికి ఇప్పటికి గ్రేటర్ అంతోఇంతో బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఇది కేసీఆర్ చేయించిన సర్వేలోనే వెల్లడింది. వీటన్నింటిని పట్టించుకోకుండానే బీజేపీ కూడా తన స్పీడ్‌ను పెంచింది. పార్టీ నేతలు వార్డుల్లో బస్తీ బాటలో దూసుకెళ్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆ పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొత్తగా గ్రేటర్ పరిధిలో నలుగురు పార్టీ అధ్యక్షులను నియమించారు. గత ఎన్నికల్లో రెండు డివిజన్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ గ్రేటర్ రేసు కోసం ఇంకా కసరత్తు ప్రారంభించ లేదు. గ్రేటర్ సీనియర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతల్లో అంతగా సందడి కనిపించట్లేదు.
Also Read: దుబ్బాకలో పార్టీల దూకుడు.. బరిలో వీరే?
ఇక మహానగరంలో ఎంఐఎం టీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందంలో ఉంది. ఎంఐఎంకు బలం ఉన్న స్థానాల్లో బలహీన అభ్యర్థులను నిలబెడతుంటుంది టీఆర్‌ఎస్. అందుకే కనీసం నలభై డివిజన్లు ఆ పార్టీకి వస్తాయి. ఇక గ్రేటర్‌లో టీడీపీ ఉందా లేదా అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు టీఆర్ఎస్‌కు పోటీ ఇస్తే వారే ప్రత్యామ్నాయం అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.