మృగశిర కార్తె నేటి నుంచి ప్రారంభమవుతుందనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మృగశిర కార్తె రోజున చాలామంది చేపలను ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు చేపలను తినడం వెనుక ఆరోగ్య రహస్యం కుడా ఉంది. రోహిణి కార్తె తర్వాత వచ్చే మృగశిర కార్తెలో నైరుతి రుతుపవనాలు వస్తాయి కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. మృగశిర కార్తెలో ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల చెడు సూక్ష్మక్రిములు పునరుత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రకృతిలో చోటు చేసుకునే మార్పుల వల్ల చాలామంది దగ్గు, జలుబు, జ్వరం, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులతో బాధ పడుతూ ఉంటారు. మృగశిర కార్తె రోజు చేపలు తినడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. మృగశిర కార్తె సమయంలో చేపలు తింటే మంచిదని శాస్త్రీయంగా సైతం నీరూపించబడటం గమనార్హం. మృగశిర కార్తెలో చేపలు తింటే గుండె జబ్బులు, మధుమేహం, ఆస్తమా సమస్యలు ఉన్నవాళ్లకు మేలు చేకూరుతుంది.
మన పూర్వీకుల నుంచి మృగశిర కార్తెలో చేపలు తినడం ఆనాదిగా వస్తుండటం గమనార్హం. చేపలు తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. చేపల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, పాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, ఇతర ఖనిజాలు లభిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేపలను తినవచ్చు. చేపలలో ఉండే కొవ్వు శరీరంలో ఉన్న రక్తపీడనంపై ప్రభావం చూపుతుంది.
చేపలు జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. చేపల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు కూడా లభిస్తాయి. చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తింటే మంచిదని నిపుణులు చెబుతుండటం గమనార్హం.