Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యానీ.. ప్రపంచంలోని ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీని కూడా చేర్చారు. హైదరాబాద్ కు వచ్చిన వారు ఎన్ని పనులున్నా.. ఇక్కడి బిర్యానీ తినంది తిరుగు ప్రయాణం చేయరు. నగరంలో ఉండే బిర్యాని రుచి మరెక్కడా లభించదని కొందరి అభిప్రాయం. అందుకు అనుగుణంగానే బిర్యానీ వంటకం రోజురోజుకు మరింత ప్రసిద్ధి చెందుతోంది. అయితే తాజాగా ఓ సర్వే ప్రకారం బిర్యానీని నేరుగా హోటల్ కు వెళ్లి తినడమే కాకుండా ఆన్లైన్లోనూ విపరీతంగా ఆర్డర్లు పెట్టారు. గత ఆరు నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆర్డర్లు పెట్టినట్లు లెక్కలు చెబుతున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బిర్యానీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గురించి తెలిసిందే. ఇంటింటికి వెళ్లి ఆహారాన్ని అందించే ఈ సంస్థ ఇటీవల కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. దేశ వ్యాప్తంగా వస్తున్న ప్రతీ 5 ఆర్డర్లలో ఒకటి బిర్యానీ ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ లో జనవరి 23 నుంచి జూన్ 15న మధ్య వచ్చిన బిర్యానీ ఆర్డ్లు 72 లక్షలు అని పేర్కొంది. ఈ సంవత్సరం 6 నెలల్లో బిర్యానీ ఆర్డర్లు 8.39 శాతం పెరిగాయని స్విగ్గీ పేర్కొంది. 2022 జూన్ నుంచి 2023 జూన్ వరకు చూస్తే 150 లక్షల ఆర్డర్లు ఉన్నట్లు తెలిపింది.
సాధారణ బిర్యానీ మాత్రమే కాకుండా బిర్యానీ రైస్ 7.9 లక్షలు, సింగిల్ బిర్యానీ 5.2 లక్షలు కూడా ఆర్డర్లు చేశారు. వీటి ఆర్డర్లు ఎక్కువగా ప్రత్యేకంగా కొన్ని రెస్టారెంట్లు మాత్రమే రెఫర్ చేస్తున్నారు. దిల్ సుఖ్ నగర్, బంజారాహిల్స్, అమీర్ పేట్, కూకట్ పల్లి, కొత్తపేట, మాదాపూర్ ప్రాంతాల్లో నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి. వీటిలో కూకట్ పల్లి అన్నింటికంటే ఫస్ట్ ప్లేసులో ఉన్నట్లు స్విగ్గి తెలిపింది.
బిర్యానీ వంటకాన్ని మాత్రమే కాకుండా కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లలో ఎక్కువ శాతం బిర్యానీ రైస్, దమ్ బిర్యానీకి సంబంధించిన ఆహార వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. హోటళ్లలో లభించే బిర్యానీని తినడానికి ఎక్కువగా ఇష్టపడని వారు ఇంట్లోనూ బిర్యానీ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు కిరాణ యజమానులు పేర్కొంటున్నారు. సాధారణ రైస్ కంటే బిర్యానీ రైస్, బిర్యానీ వంటకాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.