Telangana BJP : నిన్న జితేందర్ రెడ్డి.. నేడు రఘునందన్ రావు.. బిజెపిలో ఏం జరుగుతోంది?

పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ముదిరి పాకాన పడ్డాయా? అనే సందేహం కూడా ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వ్యక్తమవుతోంది. మరి దీనికి బిజెపి హై కమాండ్ ఎలాంటి కాయకల్ప చికిత్స చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Written By: Bhaskar, Updated On : July 1, 2023 12:01 pm
Follow us on

Telangana BJP : బిజెపి నాయకత్వాన్ని ఉద్దేశించి ఆ పార్టీకి ఇలాంటి చికిత్స అవసరం అంటూ ఏపీ జితేందర్ రెడ్డి మొన్న ట్విట్టర్లో పెట్టిన ఒక వీడియో ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో భారీ దుమారాన్ని లేపింది. ఇది జాతీయ నాయకత్వంపై రాష్ట్ర నాయకత్వానికి ఉన్న ఆగ్రహాన్ని స్పష్టం చేసింది.  అందులో ఏముందంటే.. ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటాడు. అది ఎక్కకపోవడంతో ఒక్క తన్ను తంతాడు. వెంటనే అది ట్రాలీ ఎక్కుతుంది. ఈ వీడియోతోపాటు.. ‘‘ఇలాంటి చికిత్సే తెలంగాణ బీజేపీ నాయకత్వానికీ అవసరం’’ అంటూ జితేందర్‌ రెడ్డి పోస్టు చేశారు. ఈ ట్వీట్‌ను అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సల్‌ వంటి అగ్రనేతలకు ట్యాగ్‌ చేశారు. అయితే, ఇది తీవ్ర వివాదాస్పదం కావడంతో కాసేపటికే మరో ట్వీట్‌ చేశారు. బండి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమో చెప్పే ప్రయత్నాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రీ ట్వీట్ 
 బీజేపీ నేత జితేందర్‌రెడ్డి ట్వీట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రీట్వీట్‌ చేస్తూ ఆయనను మెచ్చుకున్నారు. బీజేపీ అంతర్గత ‘తన్నులాట’ను అద్భుతమైన పోలికతో ప్రజలకు వివరించారని అభినందించారు. బీజేపీలో చేరిన వారి పరిస్థితి గురించి జితేందర్‌రెడ్డి కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరని పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో ద్వారా తెలంగాణలో బీజేపీ నాయకత్వం పని తీరు ఏమాత్రం బాగోలేదని జితేందర్‌రెడ్డి చెప్పకనే చెప్పారా? నాయకత్వం వైఖరిపై అసహనంతో ఉన్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత అసంతృప్తిని వెళ్లగక్కారంటే జితేందర్‌రెడ్డి ఏమైనా పార్టీ మారుతున్నారా? అన్న చర్చ సైతం సాగుతోంది. జితేందర్‌రెడ్డి పోస్టు వైరల్‌గా మారిన నేపథ్యంలో రెండు నెలల క్రితం జరిగిన ఆసక్తికర సంఘటనను రాజకీయ నేతలు గుర్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రెండు నెలల క్రితం జితేందర్‌రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారు. చర్చల్లో భాగంగా బీజేపీలోకి రావాలని వారిద్దరినీ కోరారు. దానికి వారు ప్రతిస్పందిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను బీజేపీ ఓడించడం అసాధ్యమని, మీరే పార్టీ మారాలని జితేందర్‌రెడ్డికి రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీనికి ఏం చెప్పాలో తెలియక.. ‘నా సంగతి వదిలేయండి. మీరైతే పార్టీలోకి రండి’ అని జితేందర్‌రెడ్డి కోరినట్లు తెలిసింది. తాజాగా వారిద్దరూ కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
రఘునందన్ రావు అలక
జితేందర్ రెడ్డి ఎపిసోడ్ ముగియకముందే తాజాగా రఘునందన్ రావు అలక తెరపైకి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు కు సంబంధించి ముంబై మహా నగరానికి చెందిన ఓ కంపెనీ దక్కించుకున్న టెండర్ విషయాన్ని రఘునందన్ రావు బట్ట బయలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. అయితే అప్పటినుంచి రఘునందన్ రావు పెద్దగా మీడియాలో కనిపించడం లేదు. టీవీ చానల్స్ లో డిబేట్ లలో బిజెపి తరఫున మాట్లాడే ఆయన నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు..” బిజెపి పెద్దలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మాత్రమే పిలుస్తున్నారు. వీరిలో ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందంటూ వైప్లస్ కేటగిరి భద్రత కల్పించారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ తరఫున భారత రాష్ట్ర సమితి పై వెన్నుచూపకుండా పోరాడుతోంది నేను. అసలు నాకు ప్రాణహాని ఉంది. నేను పార్టీ కోసం ఎంతో చేసినప్పటికీ నా సేవలను ఉపయోగించుకోవడం లేదు. ఇది నాకు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తోంది. అందుకే కొంతకాలం పాటు మౌనంగా ఉండదలుచుకున్నాను” అంటూ రఘునందన్ రావు తన అంతరంగికుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ఆయన అందుకే పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా లేరని చర్చ జరుగుతున్నది. మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేతలందరూ పార్టీ కార్యక్రమాలు సాగిస్తుంటే.. రఘునందన్ రావు మాత్రం సైలెంట్ అయ్యారు. అంటే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ముదిరి పాకాన పడ్డాయా? అనే సందేహం కూడా ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వ్యక్తమవుతోంది. మరి దీనికి బిజెపి హై కమాండ్ ఎలాంటి కాయకల్ప చికిత్స చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.