ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండు నెలల క్రితం రాష్ట్రంలో రోజుకు 10,000 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 1,000 లోపే కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు.
Also Read: కరోనా కలిపింది ఇద్దరినీ.. లైఫ్ మరింత రొమాంటిక్!
రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిపుణులు మాత్రం కరోనా విషయంలో ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని 2021 సంవత్సరం జనవరి 15వ తేదీ తర్వాత రాష్ట్రంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ నివేదికలో సైతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి కావడం గమనార్హం. చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఈ ఐదు గ్రూపుల వారికే కరోనా ముప్పు..?
దేశ రాజధాని ఢిల్లీలో ఐదు నెలల గ్యాప్ తో కరోనా సెకండ్ వేవ్ రాగా ఏపీలో కూడా అదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను పరిశీలించిన అనంతరం మన రాష్ట్రంలో జనవరి 15 నుంచి మార్చి 15 మధ్య సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కచ్చితంగా వస్తుందని చెప్పలేం కానీ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
కరోనా సెకండ్ వేవ్ మొదలైతే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలని జనవరి తొలివారం నాటికి కరోనా టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని.. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు కోరుతున్నారు.