Heart Health: వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుందంటారు. మిత ఆహార తీసుకుంటే గుండె వంటి అవయవాలు బాగుంటాయని చెబుతుంటారు. అందువల్లే చాలామంది ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేస్తుంటారు. కొంతమంది పరుగులు కూడా పెడుతుంటారు. చెమట చిందించితూ శరీరానికి శ్రమ కల్పిస్తుంటారు. తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకొని రోగాలకు దూరంగా ఉంటారు. చాలామంది వైద్యులు కూడా వ్యాయామం చేయాలని చెబుతుంటారు.. శారీరక సామర్థ్యం మెండుగా ఉంటే పరుగు కూడా పెట్టాలని సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం మితహారం తీసుకొని.. ప్రతిరోజు 5 కిలోమీటర్లు పరుగు పెట్టిన ఓ వ్యక్తికి వింత పరిణామం ఎదురైంది.
తని పేరు కార్తీక్ శ్రీనివాసన్ . వ్యక్తిగత ఆరోగ్యం పై అతడికి శ్రద్ధ చాలా ఎక్కువ. అందువల్లే మితంగా ఆహారం తీసుకుంటాడు. నూనె పదార్థాల జోలికి వెళ్లడు. మాంసాహారం ముట్టడు. మద్యం తాగడు. ధూమపానం చేయడు. ప్రతిరోజు ఉదయం 5 కిలోమీటర్లు పరుగులు పెడుతుంటాడు. చివరికి టీ, కాఫీలు కూడా తాగడు. సమతుల ఆహారం తీసుకుంటాడు. తినే తిండిలో ఫైబర్ ఉండేలాగా చూసుకుంటాడు.. కార్బోహైడ్రేట్లు మితంగా తీసుకొని.. శరీర అభివృద్ధికి సహకరించే ప్రోటీన్లను తీసుకుంటాడు. వాస్తవానికి ఇటువంటి ఆహారపు శైలి, జీవనశైలిని చాలామంది అనుసరించరు. పైగా కార్పొరేట్ కంపెనీలలో పని చేసే వ్యక్తులు ప్రకృతికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఆహారపు అలవాట్లు, ఇతర వాటిల్లో సమగ్రమైన విధానాన్ని పాటించరు. అందువల్లే వారు అనారోగ్యాల బారిన పడుతుంటారు. చిన్న వయసులోనే రక్తపోటు, అధిక కొవ్వు, మధుమేహం ఇతర రుగ్మతల బారిన పడుతుంటారు.
కార్తీక్ శ్రీనివాసన్ అలా కాదు.. మెరుగైన జీవనశైలి.. ఆహారపు అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అతడి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇటీవల కాలంలో అతడు ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. ఒంట్లో అలసటగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. తన సమస్యను వైద్యులకు చెప్తే వారు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో భాగంగా అతడి గుండె పనితీరు సక్రమంగా లేదని తేలింది. దీంతో వైద్యులు అతడికి యాంజియోగ్రామ్ నిర్వహించారు. దానిద్వారా అతడికి గుండెలో రెండు బ్లాక్స్ ఉన్నట్టు తేలింది. దీంతో వైద్యులు అతనికి రెండు స్టంట్ లు వేశారు. ఇదే విషయాన్ని కార్తీక్ శ్రీనివాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. ఆహార విషయంలో కూడా పద్ధతిగా ఉన్నాను. మద్యం తాగలేదు. సిగరెట్లు ముట్టలేదు. ఇంకా చెప్పాలంటే మాంసాహారం కూడా తీసుకోలేదు. అటువంటి నాకు ఇటువంటి శిక్ష పడింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నా గుండె లయ తప్పిందని” కార్తీక్ శ్రీనివాసన్ పేర్కొనడం విశేషం.