Horlicks : మనలో చాలామందికి ఉదయాన్నే టీ కి బదులు హార్లిక్స్ తాగే అలవాటు ఉండే ఉంటుంది. వేడివేడి పాలల్లో ఒక స్పూన్ హార్లిక్స్ వేసుకొని తాగితే చాలు ఎంతో కొంత శక్తి శరీరానికి లభిస్తుంది. హార్లిక్స్ కొనాలంటే ఎంత లేదన్నా నెలకు వందల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.. ఎంత హార్లిక్స్ అయినప్పటికీ.. ఇందులో రుచి కోసం ఏవేవో పదార్థాలు కలుపుతారనే ఆరోపణలున్నాయి. పైగా మార్కెట్లో నకిలీ వస్తువుల బెడద ఎలాగూ ఉండనే ఉంది. అలాంటప్పుడు ఇంట్లోనే హార్లిక్స్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది.. ఆలోచన బాగానే ఉంది కానీ.. తయారీకి ఎలాంటి వస్తువులు కావాలనే కదా మీ డౌటు.. ఎలా తయారు చేసుకోవాలనే కదా మీ అనుమానం.. అయితే చదివేయండి ఈ కథనం..
హార్లిక్స్ తయారీకి ప్రధానంగా కావలసింది గోధుమలు. ముందుగా నాణ్యమైన గోధుమ లను ఒకరోజు రాత్రి మొత్తం నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం కాటన్ వస్త్రంలో వడకట్టాలి. ఆ గోధుమలను ఆరబెట్టాలి. అనంతరం వాటిని వేయించాలి. దోరగా అయిన తర్వాత.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం గుప్పెడు వేరుశనగలు, బాదం గింజలు వేరువేరు పాత్రల్లో పోసుకొని దోరగా వేయించాలి. వాటిని వేరువేరుగా మిక్సీ పట్టాలి. ఇలా ఈ మూడింటి మిశ్రమాన్ని జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించిన అనంతరం.. అందులో చక్కెరను మిక్సీ పట్టి.. ఆ పొడిని అందులో కలపాలి..
ఇలా అన్నింటిని కలిపిన పొడిని ఒక శుభ్రమైన గాజు గ్లాసులో పోసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పాలల్లో ఒక స్పూన్ వేసుకుని తాగాలి. దీనివల్ల కృత్రిమ పదార్థాలు, కోకో పౌడర్ కలపని హార్లిక్స్ రుచిని మనం ఆస్వాదించవచ్చు. పైగా మన ఇంట్లో తయారు చేసుకున్నామనే సంతృప్తి ఉంటుంది. హార్లిక్స్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. బయట నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. ఇంట్లో తయారు చేసుకోవడమే బెటర్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఆ మాత్రం చేయలేమా..