Homeగెస్ట్ కాలమ్మావోయిస్టుల సవాల్.! దండకారణ్యంలో ఏం జరుగుతోంది?

మావోయిస్టుల సవాల్.! దండకారణ్యంలో ఏం జరుగుతోంది?

 

మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం (నూగూర్) మండలం అలుబాకకు చెందిన తెరాస నాయకుడిని చంపడం … కేంద్ర హోం శాఖ సీనియర్ భద్రతా సలహాదారు కె విజయ్ కుమార్(ఐపిఎస్) కు సవాల్ విసిరినట్లైందన్న చర్చ జాతీయ మీడియాలో సాగుతోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏరికోరి నియమించిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కె విజయ్ కుమార్. 20ఏళ్ల పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను మూడేళ్ళ కాల వ్యవధిలో ‘ఆపరేషన్ కకూన్’ పేరుతో అంతమొందించిన అధికారిగా కె విజయ్ కుమార్ కు పేరుంది. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదుల ఏరివేతతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరడుగట్టిన నేరగాళ్ళను అంతమొందించిన అనుభవముంది. అందుకే, నూగూరు వెంకటాపురం ఆలుబాకలో శనివారం జరిగిన ఘటన… విజయ్ కుమార్ కే నక్సలైట్లు విసిరిన పెద్ద సవాలుగా భావిస్తున్నారు.

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి మహారాష్ట్ర , ఛత్తీస్ ఘడ్, ఉత్తర తెలంగాణ, ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల అడవుల్లో… మూడు నెలలుగా పోలీసులకు, మావోయిస్టు లకు జరుగుతున్న పోరుతో నెత్తురు ఏరులై ప్రవహిస్తోంది. కేవలం నెలన్నర వ్యవధిలో 44మంది చనిపోయారు. మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కాలాన్ని మావోయిస్టు లు తమ కార్యకలాపాల విస్తరణకు వినియోగించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీఎత్తున రిక్రూట్మెంట్లు నిర్వహించిన విషయాన్ని ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. అదేసమయంలో మావోయిస్టు కేంద్ర కమిటీ… తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో ఆరుగురు రాష్ట్ర కమిటీ సభ్యులను, కొమ్రం భీం ఆసిఫాబాద్ – మంచిర్యాల, పెద్దపల్లి -జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ -భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీలను, వాటికి బాధ్యులను ప్రకటించింది. అంతేకాక ఏరియా కమిటీల ఆధ్వర్యంలో ప్రాణహిత నదీపరివాహక ప్రాంతాలతోపాటు ఉత్తర తెలంగాణాలో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టు లు కార్యకలాపాలను ముమ్మరం చేశారు.

అదే సమయంలో, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఏప్రిల్ నుంచే కూంబింగ్ ఆపరేషన్లను మొదలుపెట్టారు. అప్పటి నుంచి సరిహద్దు రాష్ట్రాల అడవులను, మావోయిస్టు లకు అనువైన ప్రాంతాలను గ్రే హౌండ్స్, సి అర్ పి ఎఫ్ బలగాలు జల్లెడపడుతున్నాయి. ఈక్రమంలోనే… సెప్టెంబర్ 3న దేవార్లగూడెం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ అంగరక్షకుడు శంకర్ చనిపోయాడు. నాలుగు రోజుల తర్వాత 7న శ్రీను, ఐతు లు పూసుగుప్ప -వద్దిపేట వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయారు. అదే నెల 19న ఆసిఫాబాద్ జిల్లా కడంబ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో చుక్కాలు, బాజీరావ్ లు చనిపోయారు. నాలుగు రోజులకే 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్ లో జోగాలు, రాజే, లలితలు హతమయ్యారు.

ఒకే నెలలో నాలుగు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్ లలో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ లకు పోలీసులు ఏర్పాటు చేసిన ఇన్ఫార్మర్లే కారణమంటూ ఆరోపిస్తూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరిట మావోయిస్టు లు ప్రకటించారు. అందుకు బాధ్యులుగా పేర్కొంటూ ఛత్తీస్ ఘడ్, బస్తర్ లకు చెందిన 25 మంది ఆదివాసీలను ఉద్యమ ద్రోహులుగా ప్రకటించి హత్యచేశారు. దీన్ని సవాలుగా భావించిన కేంద్ర హోం శాఖ సీనియర్ భద్రతా సలహాదారు కె విజయ్ కుమార్ నాలుగు రాష్ట్రాల పోలీసు అధికారులతో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు జాయింట్ యాక్షన్ ప్రోగ్రాం ను ఏర్పాటు చేశారు.

దీనిలో భాగంగానే ఈనెల 4న కె విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మూడు హెలికాప్టర్లలో పోలీస్ అధికారులు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం చేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ డిజిపి ఎం మహేందర్ రెడ్డి, ఛత్తీస్ ఘడ్ ఆంటీ మావోయిస్టు స్పెషల్ డి జి అశోక్ ఝనేజా, బస్తర్ డి ఐ జి సుందర్ రాజ్, సి అర్ పి ఎఫ్ డి జి పి ఏ పి మహేశ్వరీ, బి ఎస్ ఎఫ్ స్పెషల్ డి జి పి తూసేన్, సి అర్ పి ఎఫ్ డి ఐ జి సజారుద్దిన్ లు పాల్గొన్నారు. నక్సల్స్ అగ్రనేతల ఏరివేతే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో విజయ్ కుమార్ సంబంధిత ఎస్ పి లకు, కూంబింగ్ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కమెండోలకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశం జరిగి సరిగ్గా వారం తిరగకముందే శనివారం రాత్రి… పోలీస్ అధికారులతో విజయ్ కుమార్ సమావేశం నిర్వహించిన నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్న అలుబాక గ్రామంలో తెరాస నాయకుడిని మావోలు హత్య చేయడం, పోలీసులకు సవాలు విసిరినట్టైంది. మావోయిస్టుల చర్యను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్నంతా హై అలర్ట్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు , తెరాస, బిజెపి నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులకు మావోయిస్టు లకు మధ్య జరుగుతున్న యుద్ధంలో 8 మంది మావోయిస్టులు, 25 మంది ఆదివాసీలు, ఓ తెరాస నాయకుడు చనిపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో సామాన్య గిరిజనులు ఇరువర్గాల మధ్య జరుగుతున్న పోరులో నలిగిపోతున్నారు.

– శ్రీరాముల కొంరయ్య

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version