వైసిపి ప్రజాకంటక పరిపాలనను నిరసిస్తూ రెండు వామపక్షాలు టిడిపితో కలసి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని సిపిఐ చేస్తున్న ప్రయత్నాలకు సిపిఎం మోకాలడ్డుతున్నది. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడును ఇప్పటికే సిపిఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు కలిసి సమాలోచనలు జరిపారు.
సిపిఎం తో కలసి చర్చలు జరిపిన తర్వాత మూడు పార్టీల నాయకులు కలసి పొత్తు గురించి ప్రకటన చేస్తారని సిపిఐ నాయకులూ ప్రకటన కూడా చేశారు. కానీ ఇంతలో తాము టీడీపీ, వైసిపికి సమదూరంలో ఉంటామని సిపిఏం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రకటించడం ద్వారా టిడిపితో వామపక్షాల పొత్తుకు విముఖత వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, వైసిపితో పొత్తు ఉండబోదని స్పష్టం చేస్తూ వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, దళిత, గిరిజన, మైనార్టీ సంఘాలు కలిసి పోటీ చేయనున్నట్లు మధు ప్రకటించారు. దానితో సిపిఐ ఒంటరిగా టిడిపితో పొత్తు పెట్టుకొంటుందా, లేదా సిపిఎం తో కలసి ఉనికి లేని పార్టీలు, సంఘాలతో చేతులు కలుపుతుందా చూడవలసి ఉంది.
2019 ఎన్నికలలో సహితం ఉభయ కమ్యూనిస్టులం కలసి జనసేనతో పొత్తు పెట్టుకుందామని సిపిఐ ప్రతిపాదిస్తే సిపిఎం విముఖత వ్యక్తం చేసింది. వైసిపి నేత విజయసాయిరెడ్డితో ఉన్న బంధుత్వంతో ఆ పార్టీతో పొత్తుకు మధు సిద్దపడిపోయారు. అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి జగన్ బిజెపితో లోపాయికారి అవగాహనకు వచ్చారని గ్రహించి, విధిలేని పరిష్టితులలో చివరిలో జనసేనతో పొత్తుకు సిద్దపడవలసి వచ్చింది. అయితే ఆ పొత్తు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.