యస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఏపీ ఆర్టీసీ!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన యస్‌ బ్యాంక్‌ వ్యవహారం ఏపీలో ఆర్టీసీని సహితం చిక్కులలో పడవేసింది. అధిక వడ్డీలకు ఆశపడి ఆ బ్యాంకులో దాచుకున్న రూ 240 కోట్ల మేరకు ప్రస్తుతం బ్యాంకులో నెలకొన్న సంక్షోభం కారణంగా చిక్కుకు పోవడంతో రోజువారీ ఖర్చులకు సహితం ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్ తో గాని జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ఆర్టీసీకి గత జనవరి నుండి రాష్ట్ర ప్రభుతం ఉద్యోగుల జీతాలు చెల్లిస్తూ ఉండడంతో […]

Written By: Neelambaram, Updated On : March 10, 2020 1:11 pm
Follow us on

దేశవ్యాప్తంగా కలకలం రేపిన యస్‌ బ్యాంక్‌ వ్యవహారం ఏపీలో ఆర్టీసీని సహితం చిక్కులలో పడవేసింది. అధిక వడ్డీలకు ఆశపడి ఆ బ్యాంకులో దాచుకున్న రూ 240 కోట్ల మేరకు ప్రస్తుతం బ్యాంకులో నెలకొన్న సంక్షోభం కారణంగా చిక్కుకు పోవడంతో రోజువారీ ఖర్చులకు సహితం ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది.

ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్ తో గాని జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ఆర్టీసీకి గత జనవరి నుండి రాష్ట్ర ప్రభుతం ఉద్యోగుల జీతాలు చెల్లిస్తూ ఉండడంతో కొంత ఉపశమనం కలిగింది. దానితో రోజువారీ రాబడులను బ్యాంకులో దాచుకొంటున్నారు.

రోజువారి చెల్లింపుల్లో భాగంగా సోమవారం ఉదయం బ్యాంకుకు వెళ్లిన అధికారులకు బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాధానం తో దిమ్మతిరిగింది. ‘మీ అకౌంట్‌ నుంచి 50వేల రూపాయలకు మించి తీసుకోవడం సాధ్యం కాదు’ అని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. డీజిల్‌ కొనుగోలుకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలన్న ఆందోళన వారిలో మొదలైంది.

జనవరి నెలకు సంబంధించిన జీతం ప్రభుత్వం ఆర్టీసీకి ఫిబ్రవరిలో చెల్లించింది. ఈ డబ్బుల్లో నుంచి రూ.120 కోట్లు యస్‌ బ్యాంకులోని ఆర్టీసీ ఖాతా లో జమ అయింది. దీంతోపాటు రోజువారీ కలెక్షన్ల డబ్బులు రూ.80కోట్లు ఏ రోజుకు ఆరోజు డిపాజిట్‌ చేశారు. సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన మరో రూ 40 కోట్లను కూడా ఇదే బ్యాంకులోని పీఎఫ్‌ ఖాతాకు బదిలీ చేశారు.

దీంతో మార్చి మొదటి వారం ముగిసే నాటికి మొత్తం రూ.240 కోట్లు యస్‌ బ్యాంకులో నిల్వఉంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం, ఖాతాదారులు ఏటీఎంలకు క్యూ కట్టడంతో పరిస్థితి చేయిదాటి పోయింది.

ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు డిపాజిట్లకు తప్ప కరెంట్‌ అకౌంట్లకు వడ్డీ చెల్లించవు. యస్‌ బ్యాంకు అధికారులు ఆర్టీసీ అధికారులను సంప్రదించి కరెంట్‌ అకౌంట్‌ తమవద్ద ప్రారంభించాలని, రోజువారీ వడ్డీ చెల్లిస్తామని, అది కూడా 6.25శాతం ఇస్తామని ఆశ పెట్టడంతో వందల కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు అసలుకే ముప్పు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.