Vijay Devarakonda: దేశవ్యాప్తంగా కల్కి 2829 AD చిత్రం హవా సాగిస్తుంది. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించి చర్చ నడుస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహకు సీనియర్ రైటర్స్, డైరెక్టర్స్ ఫిదా అవుతున్నారు. అసలు మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ తో జతచేయాలన్న ఆలోచన ఎలా కలిగిందని ఆశ్చర్యపోతున్నారు. అలాగే కల్కి మూవీలోని విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్ చూసి అందరి మతిపోతుంది. పరిమిత బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గని చిత్రాన్ని నాగ్ అశ్విన్ అందించారు.
ప్రభాస్, అమితాబ్ పాత్రలను తీర్చిద్దిన తీరు, వాటిని మహాభారతంతో ముడిపెట్టిన విధానం అద్భుతం అని చెప్పాలి. కమల్ హాసన్, దీపికా పదుకొనె సైతం బలమైన పాత్రలు చేశారు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్ చేయడం విశేషం. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడు పాత్ర మెస్మరైజ్ చేసింది. చివర్లో అర్జునుడిగా విజయ్ దేవరకొండ మెరుపులు మెరిపించాడు. ప్రభాస్ తో వార్ సీన్స్ లో మెరిశాడు ఆయన.
కల్కి చిత్రంలో నటించడం పై విజయ్ దేవరకొండ స్పందించారు.ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కేవలం దర్శకుడు నాగి, ప్రభాస్ అన్న కోసమే కల్కి చిత్రం చేశానని ఆయన అన్నారు. సిల్వర్ స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, ప్రభాస్ ల మాదిరి చూడొద్దు. అర్జునుడు-కర్ణుడు గానే చూడండి, అని విజయ్ అభిప్రాయ పడ్డారు. నాగి దర్శకత్వం వహించే చిత్రాల్లో నేను నటించడం వలన హిట్ అవుతున్నాయి. నేను లక్కీ చార్మ్ అనుకుంటే పొరపాటే.
మహానటి, కల్కి గొప్ప చిత్రాలు అందుకే అవి హిట్ అయ్యాయి. అందులో నేను నటించాను అంతే… అని విజయ్ దేవరకొండ అభిప్రాయ పడ్డారు. నాగ్ అశ్విన్ ఇంత వరకు తెరకెక్కించిన మూడు చిత్రాల్లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల్లో కీలక రోల్స్ చేసిన విజయ్ దేవరకొండ, కల్కి లో గెస్ట్ రోల్ చేశాడు. విజయ్ దేవరకొండను పరిశ్రమ నటుడిగా గుర్తించింది ఎవడే సుబ్రమణ్యం తో అని చెప్పొచ్చు.