Venkaiah Naidu: ప్రపంచంలో అత్యంత చౌకైన వినోదం సినిమానే అంటూ కేంద్రంలో ఓ పెద్దమనిషి చెప్పారు. సినిమా పరిశ్రమ మనకు ఎన్నో ఇస్తోందని, ఉల్లాసం, ఉత్సాహం, వినోదంతో పాటు స్ఫూర్తిని కూడా కలిగిస్తోందని.. సినిమా మనసును తేలిక పరిచి గుండెను బరువెక్కిస్తుందని ఇలా సాగింది ఆ పెద్ద మనిషి ప్రసంగం. మైక్ దొరికితే గొప్ప స్పీచ్ లు వదులుతూనే ఉంటారు. అయినా సినిమా చూడటం చౌకే, కానీ సినిమాని నిర్మించడానికే ఒక్కోసారి జీవితాలను కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది.

దీనికితోడు మారిన ప్రపంచం, చేతిలోకి వచ్చేసిన టెక్నాలజీ.. మొత్తానికి ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వెళ్లలేకపోయినా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా చాలా ఈజీగా సినిమాని చూస్తున్నారు. కానీ ఈ సామాజిక మాధ్యమం కారణంగా సినిమాకు మేలు కంటే కూడా కీడే ఎక్కువ జరుగుతుంది. సినిమా వరకు డిజిటల్ విప్లవం అంత నిర్మాణాత్మకంగా లేకపోవడం కారణంగా కొన్ని సినిమాలకు నష్టాలు మిగులుతున్నాయి.
మరోపక్క ఏపీ లాంటి రాష్ట్రాల్లో టికెట్ రేట్లు వ్యవహారం నిర్మాతలను ఇంకా బాధ పెడుతూనే ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. కాకపోతే సినిమా సమున్నత సామాజిక, నైతిక సందేశాన్ని చాటి చెప్పేలా ఉండాలని, హింసను ప్రదర్శించడంలో సంయమనం పాటించాలని, ఇక సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సమాజం తరఫున సినిమా గళమెత్తాలని.. ఇలా బోలెడు విషయాలు చెప్పారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు.
అలాగే ఆయన ఇంకా మాట్లాడుతూ సినిమా అనేది మితిమీరిన అశ్లీలతను, ముఖ్యంగా అసభ్యతను సినిమా పూర్తిగా విడనాడాలని, అసలు ఒక సినిమా అంతిమ లక్ష్యం సందేశమే కావాలని వెంకయ్యనాయుడు చాలా ఎమోషనల్ గా చెప్పారు. 67వ జాతీయ చలన చిత్ర పురస్కార వేడుకలో సినిమా రూపకర్తలకు ఈ విధంగా తనదైన శైలిలో ఘనంగా పిలుపునిచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆయనకు తెలియనివి కావు కదా ?
మరెందుకు ఆయన ఏపీ సినిమా టికెట్ వ్యవహారం పై ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిత్యం ఆయన సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి అనేక సమస్యల పై పోస్ట్ లు వస్తూనే ఉంటాయిగా. పైగా కొంతమంది ప్రముఖులకు కూడా ఆయన ప్రత్యేక విషెష్ చెబుతూ ఉంటారు. కానీ సినిమా టికెట్ల సమస్యల పై ఎప్పుడు నోరు ఎందుకు విప్పలేదు ? కానీ, నిన్న మాత్రం ఆయన సినిమా గురించి గొప్పగా చెబుతుంటే.. సినిమా గురించి సినిమా వాళ్ళ కంటే.. ఈయనకే ఎక్కువ తెలుసు అనిపించింది. అయినా సినిమా గొప్పతనం ఓకే, మరి కష్టాల మాటేమిటి ? అసలు అంతా తెలిసి అధికారంలో ఉండి మౌనమెందుకో ?