Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్… దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి… విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న స్టార్ అంటే రజినీ అనే చెప్పాలి. ఇండియన్ సూపర్‌స్టార్‌గా 4 దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం … రజినీకి ” దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు” ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ అవార్డును రజనీకాంత్‌కు ప్రదానం చేయనున్నారు.
భారతీయ సినీ పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద 1969లో ఈ అవార్డును నెలకొల్పారు. ఫాల్కే అవార్డు దక్కిన 51వ సినీ ప్రముఖుడు రజనీకాంత్ చరిత్రకెక్కారు. 2019వ సంవత్సరానికి గాను రజనీకి ఈ అవార్డు ప్రకటించారు. గతంలో తమిళంలో హీరో శివాజీ గణేశన్ (1996), దర్శక – నిర్మాత కె. బాలచందర్ (2000)లకు కూడా ఫాల్కే అవార్డు దక్కింది. వారి తర్వాత ఆ అవార్డు సాధించిన మూడో తమిళ సినీ ప్రముఖుడుగా గుర్తింపు పొందారు. అలానే ఇప్పటి దాకా తెలుగువారైన బి.ఎన్. రెడ్డి, పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని, రామానాయుడు, కె. విశ్వనాథ్‌లు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. కానీ ఈ సమయంలో తన గురువు కె.బాలచందర్ లేకపోవడం పట్ల రజినీ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్తతో సూపర్ స్టార్ రజినీ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.