Mohan Babu: జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద గత రెండు రోజులుగా హైడ్రామా నడుస్తుంది. మోహన్ బాబు-మనోజ్ ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. జుల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోనే మనోజ్, మౌనిక దంపతులు ఉంటున్నట్లు సమాచారం. గొడవలు జరిగి, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్న తరుణంలో మనోజ్ ని మోహన్ బాబు ఇంటి నుండి వెళ్లిపోవాలని హెచ్చరించాడట. తన ఇంట్లో మనోజ్, మౌనిక ఉండటానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పాడట.
మనోజ్ కూడా అక్కడ నుండి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడని, సామానులు తరలించేందుకు వాహనాలు వచ్చాయని వార్తలు వెలువడ్డాయి. డిసెంబర్ 10 సాయంత్రం మరలా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. మోహన్ బాబు మనుషులు మనోజ్ ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మరలా తోపులాట జరిగింది. ఇదంతా కవర్ చేసేందుకు మీడియా గేటు దాటి లోపలి వెళ్లారు.
ఓ ప్రముఖ మీడియా ప్రతినిధి మైక్ తో మోహన్ బాబును ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నం చేశాడు. కోపంగా ఉన్న మోహన్ బాబు చేతిలోని మైక్ తీసుకుని రిపోర్టర్ తలపై బలంగా కొట్టాడు. దీనికి సంబంధించిన విజువల్స్ రికార్డు అయ్యాయి. ఈ దాడిలో సదరు రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తలను వైద్యులు స్కాన్ తీశారు. పై దవడకు కొంచెం పైన ఉండే జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల విరిగినట్లు వైద్యులు స్కానింగ్ లో గుర్తించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారట.
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలకు సిద్ధం అయ్యారు. మోహన్ బాబు పై 118 బిఎన్ఎస్ సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. అలాగే రాచకొండ పోలీసులు నేడు ఉదయం విచారణ హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు అనారోగ్యానికి గురైన మోహన్ బాబు ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు చికిత్స జరుగుతుందని సమాచారం.
కాగా ఈ మొత్తం ఉదంతాన్ని తెలియజేస్తూ మోహన్ బాబు ఒక ఆడియో సందేశం విడుదల చేశాడు. సదరు ఆడియోలో మనోజ్ మద్యానికి బానిస అయ్యాడు. తప్పులు మీద తప్పులు చేస్తున్నాడు. విద్యాసంస్థల్లో అవకతవకలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆవేదన చెందాడు. మీడియా కూడా ఇకపై మా విషయాలు రాయొద్దని అందులో వెల్లడించారు.