Premalu : గత ఏడాది విడుదలైన సినిమాలలో తొలిచిత్రం తోనే ఆడియన్స్ నుండి అశేష ఆదాహరణ దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు మామితా బైజు. ‘ప్రేమలు’ అనే మలయాళం చిత్రం ద్వారా ఈమె మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ చిత్రంతో ఎంతో క్యూట్ గా కనిపించడమే కాదు, చక్కని అభినయం కూడా కనబర్చి కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత ఆమెకి ఏకంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ చివరి చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశాన్ని సంపాదించింది. ఈ చిత్రం తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల పోషించిన పాత్రను మమితా బైజు చేస్తుంది. ఈ సినిమాతో పాటు ఆమె బాలా దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘వనంగాన్’ అనే చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకుంది.
అయితే డైరెక్టర్ బాలా గురించి ఇది వరకు మనం చాలానే విని ఉంటాము. ఆయన హీరోయిన్స్ ని బాగా కొడతాడని, ఒక్క సన్నివేశానికి ఎక్కువ టేకులు తీసుకుంటే అసలు సహించడని, ఇతనికి ఉన్న ఈ కోపం కారణంగా ఏ హీరోయిన్ కూడా ఆయన సినిమాలో నటించేందుకు అంగీకరించే వాళ్ళు కాదని కోలీవుడ్ లో ఒక రూమర్ ఉంది. రీసెంట్ గా ఆయన ‘వనంగాన్’ సెట్స్ లో మామితా బైజు మీద కూడా చెయ్యి చేసుకున్నట్టు మమిత ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘బాలా సార్ షూటింగ్ సెట్స్ లో నన్ను కొట్టాడు. నాకు అది నచ్చలేదు. అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. మళ్ళీ ఆమె నేను అలా అనలేదని, నా మాటలను మీడియా వక్రీకరించి చెప్పిందని కవర్ చేసుకుంది. అయితే ఈ ఘటనపై ఏకంగా బాలానే స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘మమిత ని నేను కొట్టినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. షూటింగ్ స్పాట్ లో ఆమె ఓవర్ గా మేకప్ వేసుకొని వస్తుండేది. నేను అలా రావొద్దని చాలాసార్లు చెప్పాను. కానీ ఆమె అలాగే వచ్చేది. నాకు సహనం నశించి ఎందుకు అలా మేకప్ వేసుకొని వస్తున్నావు అని కొట్టేట్టు చెయ్యి పైకి ఎత్తాను, కానీ కొట్టలేదు. నేనెందుకు ఆ అమ్మాయిని కొడుతాను. మమిత నాకు బిడ్డ లాంటిది. ఆడవాళ్ళపై చెయ్యి చేసుకునేంత కుసంస్కారం నాకు లేదు’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రాన్ని తొలుత హీరో సూర్య, కృతి శెట్టి, మమతా బైజు తో మొదలైంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సూర్య, కృతి శెట్టి ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మమితా బైజు కూడా తప్పుకుంది. దీంతో బాల అరుణ్ విజయ్ ని పెట్టి ఈ చిత్రాన్ని తీసాడు. హీరోయిన్ గా రోషిని ప్రకాష్ నటించింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.