https://oktelugu.com/

TCS: విశాఖకు టిసిఎస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం

దేశంలోనే దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో కూటమి సర్కార్ సరికొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 1, 2025 / 05:51 PM IST

    TCS

    Follow us on

    TCS: విశాఖను ఐటీ హబ్ గా మార్చాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. పెద్ద ఎత్తున ఐటీ సంస్థలను ఆకర్షించి విశాఖలో ఏర్పాటు చేయాలన్నది టార్గెట్. గత ఏడు నెలలుగా ఇందుకు సంబంధించి ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి. అవి ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఐటి సెజ్ లో ఉన్న మిలీనియం టవర్లను ఐటీ కంపెనీలకు ఇవ్వడానికి వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికలకు ముందు ఈ టవర్లలో ఐటీ కంపెనీలు ఉండేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. చిన్నచిన్న ఐటీ సంస్థలు వేరేచోటకు తరలిపోయాయి. ప్రస్తుతం ఈ భవనంలో ఉన్న కొన్ని అంతస్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ టవర్లను టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టిసిఎస్ కు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

    * పదివేల మందికి ఉద్యోగాలు
    విశాఖలో టిసిఎస్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా కంపెనీని ఏర్పాటు చేస్తామని రెండు నెలల కిందట చైర్మన్ ప్రకటించారు. అయితే సొంత భవనం నిర్మించుకునే లోపు.. అనువైన భవనం ఉంటే తాత్కాలిక క్యాంపస్ తెరుస్తామని ఆ సంస్థ తెలిపింది. అందుకే ఇప్పుడు మిలీనియం టవర్లు టిసిఎస్ కు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థగా టిసిఎస్ ఉంది. టిసిఎస్ విశాఖలో అడుగు పెడితే ఆ తరువాత మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    * సెజ్ నుంచి తప్పించేందుకు నిర్ణయం
    రిషికొండ హిల్ నెంబర్ 3 లో ఐటి సెజ్ ఉంది. అందులో మిలీనియం టవర్లు ఉన్నాయి. వీటిని పూర్తిగా ఐటి కంపెనీలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రాంతం ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉండడంతో ఐటీ కంపెనీలు ప్రారంభించే వారు వెనక్కి తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధి నుంచి రిషికొండ హిల్ 3 ని తప్పించనున్నట్లు సమాచారం. విశాఖకు టిసిఎస్ తో పాటు చాలా కొత్త ఐటీ కంపెనీలు వస్తున్నందున.. వాటికి తగిన సౌకర్యాలు ఉన్న మిలీనియం టవర్లను కేటాయించేందుకు అనువుగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.