Bigg Boss Telugu 8 : ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 నేడు గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ లాంచ్ ఎపిసోడ్ ద్వారా సీరియల్ హీరో నిఖిల్, ఆదిత్య ఓం (లాహిరి లాహిరి లాహిరిలో ఫేమ్), యాంకర్ విష్ణు ప్రియా, ప్రేరణ, యష్మీ గౌడ , డ్యాన్సర్ నైనికా, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా తదితరులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తం మీద 14 మంది హౌస్ లోకి అడుగుపెడితే అందులో 7 మంది అబ్బాయిలు, 7 మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లందరినీ హోస్ట్ నాగార్జున జంటలుగా విడదీసి లోపలకు పంపాడు. ఇదంతా పక్కన పెడితే ఈ షో లో ఒక కంటెస్టెంట్ గా బర్రెలక్క ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుండో సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తూనే ఉంది. బర్రెలక్క ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికలలో ఈమె పేరు మారుమోగిపోయింది. సోషల్ మీడియా లో కూడా బాగా ఫేమస్ అయ్యింది. ఒక సామాన్యురాలి పేరు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రేంజ్ లో రీ సౌండ్ వచ్చిందంటే ఆమెలోని సత్తా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈమె లాంచ్ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మాత్రం కచ్చితంగా హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది అనే టాక్ బలంగా వినిపిస్తుంది. గత సీజన్ లో మినీ లాంచ్ ఎపిసోడ్ ని 5 వ వారం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 5 మంది కంటెస్టెంట్స్ ని లోపలకు పంపారు. కానీ ఈసారి మాత్రం వారానికి ఒకరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వరుసగా 7 వారాల్లో 7 మంది కంటెస్టెంట్స్ ని లోపలకు పంపబోతున్నట్టు తెలుస్తుంది. అందులో బర్రెలక్క కూడా ఉంటుందట. ఎలాంటి ఆధారం లేకుండా ఒక సామాన్యురాలిగా ఈ స్థాయి పాపులారిటీ ని తెచ్చుకున్న బర్రెలక్క శిరీష, ఈ బిగ్ బాస్ షో ద్వారా ఇంకెంత పాపులారిటీ ని సంపాదించుకుంటుందో చూడాలి.
బర్రెలక్కతో పాటుగా పాత బిగ్ బాస్ సీజన్స్ నుండి ముగ్గురు కంటెస్టెంట్స్ ని లోపలకి పంపబోతున్నట్టు తెలుస్తుంది. అందులో గత సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శోభా శెట్టి ఉంది. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి మొదటి వారంలోనే ఎలిమినేషన్ కి గురైన నయని పావని కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది. మొదటి రోజే ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన బిగ్ బాస్ టీం, రాబోయే రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులు ఇస్తారో అని ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఆ మాత్రం ట్విస్టులు ఉంటేనే మజా ఉంటుంది, లేకపోతే బిగ్ బాస్ సీజన్ 6 లాగ పస లేకుండా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.