Shreyas Talpade : సోషల్ మీడియా మంచికి వాడుకోవాలి కానీ.. చెడుకు కాదు.. కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. వైరల్, ట్రోల్స్ ఎక్కువై మానవ జీవనానికి అడ్డు పడుతున్నాయి. బతికి ఉన్న వారిని చంపేయాలంటే ఒక్క పోస్ట్ చాలు.. అది సెలబ్రెటా.. లేదంటే సాధారణ వ్యక్తినా అని ఎవరూచూసుకోవడం లేదు.. పైగా సెలబ్రెటీ అయితే లైకులు, షేర్లు పెరిగి మనం కూడా పాపులర్ అవుతామని అనుకుంటున్నారు వైరల్ రాయుళ్లు.. ఇటీవల ఒక ఫేమస్ నటుడు బతికి ఉండగానే చనిపోయారంటూ వైరల్ చేశారు. విషయం తెలిసి ఆయన తల పట్టుకున్నారు. నటుడు శ్రేయాస్ తల్పాడే చనిపోయాడంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది ఫేక్ అని ఆయన ఒక నోట్ విడుదల చేసేవరకు అందరూ నిజమే అనుకున్నారు. తాజాగా ఈ పోస్ట్ పై శ్రేయాస్ స్పందించారు. ఈ ఫేక్ ప్రచారం ద్వారా తన కుటుంబం, శ్రేయోభిలాషులు ఆందోళనలో పడ్డారని తెలిపారు. తన అభిమానులను కూడా ఈ ఫేక్ వైరల్ పోస్ట్ షాక్ గురి చేసిందన్నారు. పలు సినిమాలతో విశేష అభిమానులను సొంతం చేసుకున్న శ్రేయాస్ తల్పాడే ఇదంతా బూటకమని కొట్టిపారేశాడు. ఎదుటివారి భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదని మండిపడ్డాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ లేఖను ఆయన రాశాడు. తాను ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నానని అందులో పేర్కొన్నాడు. ఈ ఫేక్ ప్రచారం కారణంగా తనను వెంటనే సంప్రదించిన స్నేహితులు, అభిమానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. నేను చనిపోయానంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారం గురించి నాకు తెలిసింది. ఇది చూసి నాకు నవ్వొచ్చింది.. కానీ ఇది నాకుటుంబానికి ఎంతో బాధను మిగిల్చింది. నా కుటుంబ సభ్యుల భావోద్వేగాలతో ఆడుకున్నారు.. ఇది సరికాదంటూ రాసుకొచ్చారు.
తన కూతురి గురించి ఏమన్నారంటే..
పాఠశాలకు వెళ్లే నా బిడ్డ ఎంతో ఆందోళనకు గురైంది. అక్కడ ఉపాధ్యాయులు, స్నేహితులు తనను పదే పదే ఆరా తీశారు. తనలో భయం ఇంకా పెరిగింది. ఇలాంటి ఫేక్ ప్రచారాలను వ్యాప్తి చేయొద్దు.. నా కుటుంబానికి ఎంతో ఇబ్బందిగా ఉందంటూ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. తన మనసులో భావాన్న ఈ సందర్భంగా తన అభిమానులు, శ్రేయోభిలాషులు, ట్రోలర్స్ తో పంచుకున్నాడు. ‘నా అభ్యర్థనను మన్నించండి.. దయచేసి ఇలాంటి ఫేక్ పోస్టులను ఆపండి.. ఇతరుల జీవితాలను ఫణంగా పెట్టి ట్రోల్స్ చేయొద్దు.. ఎవరికీ ఇలా జరగాలని కోరుకోకూడదు.. ఇది ఎవరికీ మంచిది కాదు.. అంటూ రాసుకొచ్చాడు. తనను, తన కుటుంబాన్ని ఎంతో బాధించిన ఈ ఫేక్ ప్రచారాన్ని ఇక ఆపేస్తారని భావిస్తున్నానని, ఇది పొరపాటున చేసి ఉంటారని అనుకుంటున్నానని తెలిపాడు.
అసలేం జరిగిందంటే..
గతేడాది డిసెంబర్ 14న ‘వెలకమ్ టు ది జంగిల్’ మూవీ చిత్రీకరణలో ఉన్న శ్రేయాస్ అస్వస్థతతో గురయ్యాడు. మంబైలో షూటింగ్ జరుగుతుండగా ఆయనకు సడెన్ గా గుండెపోటు వచ్చింది. వెంటనే అక్కడి బెల్లేవ్ వైద్యశాలలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. అయితే ఒక న్యూస్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కోవిడ్ 19 వ్యాక్సిన్ దుష్ర్పభావం వల్లే తనకు గుండెపోటు వచ్చిందని పేర్కొన్నాడు. ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది.
తనకు ధూమపానం అలవాటు లేదని, మద్యం కూడా ఎక్కువ తాగనని, మధుమేహం, రక్తపోటు లేవని చెప్పుకొచ్చాడు. కొలెస్ర్టాల్ ఎక్కువగా ఉన్నకారణంగా కొన్ని మందులు వాడుతున్నానని, కానీ గుండెపోటుకు కారణమేంటో అర్థం కావడం లేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కోవిడ్ ప్రభావం తర్వాత తనలో కొంత అలసట మాత్రం గమనించానని చెప్పాడు.
విభిన్న చిత్రాలతో విశేష ఆదరణ
2002లో ‘ఆంఖే’ సినిమా ద్వారా శ్రేయాస్ తల్పాడే నటనా రంగంలోకి అడుగు పెట్టాడు. పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ముంబైకి చెందిన ఈ నటుడు ఫిల్మ్ ఫేర్ తో పాటు పలు అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. బుల్లితెరపై కూడా తనదైన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. తను నటించిన ఇక్బాల్ తో మతిస్థిమితం లేని బాలుడి పాత్ర విశేష ఆదరణ పొందింది.