Nizam Sarkaroda Review: భారత దేశ స్వతంత్ర చరిత్రలో తెలంగాణ విమోచన పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.. 1948 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు నిజాం ఏలుబడిలో ఉండేవి.. నిజం పరిపాలన కాలంలో రజాకార్లు తెలంగాణ ప్రజలను తీవ్రంగా హింసించేవారు. ఆడవాళ్లను చెరిచి రాక్షసానందం పొందేవారు. తెలంగాణలో బైరాన్ పల్లి దగ్గర నుంచి మొదలు పెడితే గార్ల తాలూకా వరకు.. ప్రతి ప్రాంతం నిజాం ఆకృత్యాలకు ప్రతీకలుగా ఉన్నాయి. నిజాం కాలంలో ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డారో పరకాలలోని అమరధామం చూస్తే చాలు.. నాటి పరిస్థితులు కళ్ళకు కడతాయి. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ.. తెలంగాణ ప్రాంతానికి మాత్రం రాలేదు. తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా పరిపాలించుకుంటానని నిజాం నవాబ్ భావించాడు.. కానీ అతని ఆశలను భారత ప్రభుత్వం కూల్చేసింది. భారత సైన్యం సహాయంతో హైదరాబాద్ కు స్వేచ్ఛను ప్రసాదించి భారతదేశంలో భాగం చేసింది..
కథ ఏంటంటే
నైజాం వ్యతిరేక పోరాటం వెనుక ఉన్న చరిత్ర నేటి తరానికి చాలా వరకు తెలియదు.. నేటి తెలంగాణ భారత దేశంలో భాగమైందంటే, స్వేచ్ఛ వాయువులు పీల్చుతోందంటే రజాకార్లపై నాడు ప్రజలు, వివిధ పార్టీలు చేసిన పోరాట ఫలితమే. నాటి పోరాట ఘట్టాలను, మరుగున పడిన యోధుల పోరాట పటిమను స్పృశిస్తూ మరాఠీలో రజాకార్ అనే పేరుతో సినిమాగా రూపొందించారు. అది ఇప్పుడు నైజం సర్కరోడా పేరుతో తెలుగులో విడుదలైంది. వాస్తవానికి ఈ సినిమా మరాఠీలో ఎప్పుడో విడుదలైనప్పటికీ.. తెలుగులో రిలీజ్ కాకుండా అప్పటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అడ్డుకుంది. ఈ సినిమా విడుదలకు అనేక అడ్డంకులు సృష్టించి నిర్మాతలను ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ నిర్మాత వెరవకుండా ఈ సినిమాను యూట్యూబ్లో విడుదల చేశారు.
నటీనటులు సిద్ధార్థ జాదవ్, జ్యోతి సుభాష్, శరద్ బుటాడియా, శశాంక్ షిండే, జాకీర్ హుస్సేన్.
దర్శకుడు: రాజ్ దుర్గే
నిర్మాత: తెలుగులో రత్నం దవేజి సమర్పణలో మౌళి ఫిలిమ్స్ పతాకంపై రాజమౌళి నిర్మాతగా ఈ సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చారు.
మరాఠీలో భారీ విజయం
మరాఠీలో రజాకార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా ఏళ్ళ క్రితమే ఆ సినిమా అక్కడ విడుదలైంది. నాటి పోరాట ఘట్టాలను ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా దర్శకుడు తెరకెక్కించడంతో.. అక్కడి ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని, మహారాష్ట్రలో స్థిరపడిన పోరాటయోధుడి తనయుడు రాజ్ దుర్గే ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో.. ఇందులో సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి.. రజాకార్ల రాజ్యంలో 17 సెప్టెంబర్ 1948 కంటే ముందు జరిగిన ఆకృత్యాలు, దారుణాలను ఈ సినిమాలో దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. తన కుటుంబాన్ని సాదుకునేందుకు ఓ సామాన్య మనిషి ఎలా పోరాడాడు? చారిత్రాత్మక పోరాటంలో ఎటువంటి పాత్ర పోషించాడు? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. నాటి తెలంగాణ ప్రజల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థితిగతులు కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో నాటి రజాకార్లు చేసిన దారుణాలపై ప్రజలు రెండు రకాల పోరాటాలు చేశారు. ఒక పోరాటం మరాఠీ ప్రజలు, ఆర్య సమాజ్ వారు కలిసి సాగించారు. మరో పోరాటాన్ని సామాన్య ప్రజలు, కమ్యూనిస్టులు కలిపి నిర్వహించారు. ఈ సినిమాలో ఆ పోరాటాలు అడుగడుగునా కనిపిస్తాయి.
ఇదే సినిమాలో కీలక మలుపు..
నిజామాబాద్ జిల్లాలోని ఖాండ్ గామ్ గ్రామానికి చెందిన హరి అనే పేద అమాయక యువకుడి తల్లిని రజాకార్ల మూకలు అత్యంత కిరాతకంగా హత్య చేస్తాయి. తన తల్లి మరణంతో దిక్కులు పిక్కటిల్లే విధంగా హరి ఏడుస్తాడు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని తన తల్లి మరణానికి కారణమైన రజాకార్ల మూకలపై పోరాడిన విధానమే ఈ సినిమా కథలో ప్రధాన అంశం. ఈ సినిమాలో తల్లి కొడుకుల అనుబంధాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించాడు. గుండెల్ని హత్తుకునే విధంగా మలిచాడు.. హరి నిజాం మూకలపై దాడులు చేసే సన్నివేశాలు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తాయి. లిమిటెడ్ బడ్జెట్ లోనే ఈ స్థాయిలో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అందుకు దర్శకుడిని కచ్చితంగా మెచ్చుకొని తీరాలి. సినిమా అంటేనే కమర్షియల్. కానీ అలా వ్యాపార కోణంలోకి వెళ్లకుండా ఇలాంటి పీరియాడికల్ డ్రామాను నిర్మించారంటే నిర్మాతను మెచ్చుకొని తీరాల్సిందే.
ఎవరు ఎలా చేశారంటే..
ఈ సినిమాలో ఎవరి పాత్రను తక్కువ చేయడానికి లేదు. సిద్ధార్థ జాదవ్ తన పాత్రలో ఒదిగిపోయాడు, జ్యోతి సుభాష్ తన నటనతో మెప్పించింది, శరద్ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. శశాంక్ షిండే ఒదిగిపోయి నటించాడు. జాకీర్ హుస్సేన్ తన పాత్రకు న్యాయం చేశాడు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్టుగా ఉంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చరిత్రకు సంబంధం లేకుండా ఉన్నాయని ఆరోపణలు ఉన్నప్పటికీ.. నాటి నిజం దురాఘతాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే కచ్చితంగా నైజాం సర్కరోడ సినిమాను ఈ తరం వారు కచ్చితంగా చూడాల్సిందే.
సినిమా రేటింగ్: 3/5