Megha Akash Wedding: యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆమె ఓ పొలిటికల్ లీడర్ కొడుకుతో ఏడడుగులు వేయనున్నారట. ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. చెన్నైకి చెందిన మేఘా ఆకాష్ ని నితిన్ హీరోయిన్ గా పరిచయం చేశాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లై మూవీతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. యాక్షన్ థ్రిల్లర్ లై చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అయినా వెంటనే మరో సినిమాకు నితిన్ ఆమెకు ఆఫర్ ఇచ్చాడు.
ఛల్ మోహన్ రంగ మూవీలో నితిన్-మేఘా ఆకాష్ జతకట్టారు. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలు కావడం విశేషం. ఛల్ మోహన్ రంగ సైతం నిరాశపరిచింది. దాంతో టాలీవుడ్ కి కొన్నాళ్ళు దూరమైంది. వరుసగా తమిళ చిత్రాలు చేసిన మేఘా ఆకాష్ 2021లో రీఎంట్రీ ఇచ్చింది. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ రాజ రాజ చోర చిత్రంలో హీరోయిన్ రోల్ చేసింది. ఈ చిత్రం పాజిటివ్ తెచ్చుకోవడం విశేషం.
అనంతరం డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం, ప్రేమ దేశం అంటూ వరుస చిత్రాలు చేసింది. ఆమెకు బ్రేక్ మాత్రం రాలేదు. ఆమె లేటెస్ట్ మూవీ రావణాసుర. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం మీద ఆమె చాలా ఆశలే పెట్టుకున్నారు. అనూహ్యంగా రావణాసుర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మేఘా ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. అడపాదడపా ఆఫర్స్ వస్తున్నా మేఘాను స్టార్ ని చేసే మూవీ పడలేదు.
ఈ క్రమంలో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఓ పొలిటీషియన్ కొడుకుతో మేఘా ఆకాష్ పెళ్లి నిశ్చయమైంది. త్వరలో అధికారిక ప్రకటన అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై మేఘా ఆకాష్ తల్లి స్పందించారు. మేఘా వివాహం చేసుకుంటున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ పుకార్లు ఎవరు పుట్టిస్తారో కూడా తెలియదు. ఆమె కొత్త సినిమా రిలీజ్ టైం లో కూడా ఇన్ని ఫోన్లు రాలేదు. అందరూ ఫోన్ చేసి మేఘా వివాహమట కదా అని విసిగిస్తున్నారని ఆమె వాపోయారు. ప్రస్తుతం మెగా ఆకాష్ ఓ తెలుగు, మరో తమిళ చిత్రం చేస్తున్నారు.