TDP in Uttarandhra : ఉమ్మడి ఏపీలోనైనా.. అవశేషాంధ్రప్రదేశ్ లోనైనా ఉత్తరాంధ్రది ప్రత్యేక స్థానం. చివరి ప్రాంతం. అభివృద్ధిలో కూడా వెనుకబడి ఉందన్న అపవాదు ఎదుర్కొంది. అయితే రాజకీయ చైతన్యం ఎక్కువ. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండగా నిలిచిన ప్రాంతం. దాదాపు క్లీన్ స్వీప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పార్టీ 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనానికి కొట్టుకుపోయింది. ఉత్తరాంధ్రలోని 33 నియోజకవర్గాలకుగాను కేవలం ఆరు స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. అయితే 2024 ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉంటుందా? అంటే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ బలం పుంజుకుందని విశ్లేషిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో హేమాహేమీలైన నాయకులు రాజకీయ అరంగేట్రం చేశారు. దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు, కిమిడి కళా వెంకటరావు, తమ్మినేని సీతారాం, తమ్మినేని సీతారాం, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వంటి నాయకులు టీడీపీ కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన వారే. మూడు పదుల వయసులో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన నాయకులు.. ప్రస్తుతం ఆరు పదులకు చేరుకున్నారు. ఇందులో మెజార్టీ నాయకులు పార్టీలో కొనసాగుతున్నారు. అవసరాల కోసం ఒకరిద్దరు నాయకులు అటు ఇటు వెళ్లిపోయారు. ప్రస్తుతం నాయకుల వారసులు తెరపైకి వస్తున్నారు. టీడీపీ నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
2004 వరకూ టీడీపీ హవా కొనసాగింది. రాజశేఖర్ రెడ్డి ఎంట్రీతో టీడీపీకి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. గణనీయమైన ఓట్లు, సీట్లు కోల్పోయింది. అయితే గౌరవప్రదమైన స్థానాలతో బయటపడింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం రూపంలో త్రిముఖ పోటీ నెలకొనడంతో దారుణంగా దెబ్బతింది. అయితే 2014 ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ పుంజుకుంది. ఒక్క రిజర్వ్ స్థానాలను మినహాయించి.. మిగతా స్థానాలను కైవసం చేసుకుంది. మళ్లీ 2019కి వచ్చేసరికి జగన్ ప్రభంజనంలో దాదాపు కొట్టుకుపోయింది. విశాఖ నగరంలో నాలుగు, శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. పడిన ప్రతిసారి లేచే ప్రయత్నం చేస్తోంది. 2024లో మరోసారి లేచే ప్రయత్నంలో ఉంది.
ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులంతా సమన్వయంతో వ్యవహరించడంతో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో సైతం సమన్వయంగా వ్యవహరిస్తే పూర్వ వైభవం ఖాయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెడితే విజయం సునాయసమని చెబుతున్నారు. టీడీపీ నేతలు పైకి అమరావతి నినాదంతో ముందుకు వెళ్తున్నా.. మూడు రాజధానుల నినాదం తమకు ఏ మేర నష్టం చేస్తుందనే ఆందోళన ఉండేది. కానీ, విశాఖ రాజధాని అని పదే పదే చెబుతున్నా.. ఉత్తరాంధ్ర పట్టభద్రులు వైసీపీని కాదని.. టీడీపీకి ఓట్లు వేయటం విశేషం. ఇదే స్ఫూర్తితో వ్యవహరిస్తే మాత్రం టీడీపీ వర్ వన్ సైడ్ సాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.