
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోల్లి ఇంకా సద్దుమణగడం లేదు. ప్రకాష్ రాజ్ ఎంట్రీతో మొదలైన ఈ వివాదంలోకి మంచు కుటుంబం నుంచి హీరో విష్ణు రాకతో మరింత జటిలమైంది. తాను అధ్యక్షుడిని అయితే వెంటనే ‘మా’కు భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మిస్తానని ప్రకటించాడు. నాన్ లోకల్ అంటూ వేరే వారిపై విమర్శలు గుప్పించాడు.
ఇక మంచు విష్ణుకు మద్దతుగా అగ్రహీరో బాలయ్య మాట్లాడాడు. మంచు విష్ణుతోపాటు తాను కూడా ‘మా’ భవన నిర్మాణానికి సాయం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే మరోసారి మీడియా ముందుకు వచ్చారు మంచు విష్ణు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాప్ హీరో నందమూరి బాలక్రిష్ణ ‘మా’ అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని మంచు విష్ణు అన్నారు. తెలుగు సినీ పరిశ్రామలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరినైనా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తప్పకుండా తాను ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
బాలయ్య నాకు సోదరుడు లాంటి వాడు అని.. ఒకవేళ ఆయన్నే కనుక ఈసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే నేను ఎంతో ఆనందిస్తానని.. ఆయన అధ్యక్షుడు అయితే అందరికీ మంచి జరుగుతుంది.. బాలయ్య మాత్రమే కాదు.. ఆయన జనరేషన్ కు చెందిన కొంత మంది నటీనటులు అప్పట్లో ‘మా’ ఎన్నికల్లో నిలబడలేదు.. వాళ్లలో ఎవరు నిలబడినా తాను వైదొలుగుతానని మంచు విష్ణు సంచలన ప్రకటన చేశారు.
ఇక ఇటీవల నాగబాబు చేసిన కామెంట్లకు మంచు విష్ణు బదులిచ్చాడు. ‘నాగబాబు నాకు తండ్రిలాంటి వ్యక్తి. ఆయనంటే నాకెంతో ఇష్టం. ప్లానింగ్ గురించి అడిగాడు. మా శాశ్వత భవనం నిర్మాణంపై తనకు ప్లానింగ్ ఉందని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో తనకు మంచి సంబంధాలున్నాయని అన్నారు. వాళ్లతో మాట్లాడి ‘మా’కు కావలసిన భూమిని సంపాదించుకోగలననే నమ్మకం ఉంది అని విష్ణు తెలిపారు.