ఆంధ్రప్రదేశ్ లో కులాల ప్రాతిపదికగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో కమ్మ, రెడ్డి, క్షత్రియ తదితర కులాలకు ఇప్పటికే సీఎం జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా వారి ఆర్థిక చేయూతు నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా కాపులకు సైతం తమ ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పారు. రూ.490 కోట్లు కాపు మహిళల ఖాతాల్లోకి మళ్లించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో ముందుకు వెళుతున్నారు.
కాపు నేస్తం రెండో దశ పథకాన్ని కొనసాగించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన మహిళలకు 3,27,244 మందికి నిధులు విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కాపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కాపులను బీసీలుగా, ఓసీలుగా ప్రకటించిందా అనేదానిపై సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అప్పట్లో చంద్రబాబు కావాలనే కాపులకు న్యాయ వివాదాలు సృష్టించిందని చెప్పారు. దీంతో అగ్రవర్ణ పేదలకు సైతం న్యాయం అందకుండా పోయే పరిస్థితి దాపురించిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అందరికి న్యాయం చేసేలా చూస్తుందని వివరించారు. కాపులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. నిధుల విడుదలపై కాపు నేతలు సీఎం జగన్ కు అభినందనలు తెలియజేశారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు కులాలనే టార్గెట్ చేస్తున్నాయి. మేమంటే మేం అని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మా ప్రభుత్వమే అన్ని కులాలను ఆదరించిందని వైసీపీ, టీడీపీ చెబుతున్నాయి. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేసినా టీడీపీ సైతం తమ స్థాయికి తగినట్లు పథకాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచించేందుకు చూస్తోంది. అధికారం వచ్చిన వెంటనే తమ ప్రభావం చూపుతామని దీమా వ్యక్తం చేస్తున్నారు.