Manchu Lakshmi : కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ మానభంగం, హత్య ఘటన దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఉదంతం నేపథ్యంలో మహిళల రక్షణ, వేధింపుల అంశం తెరపైకి వచ్చింది. సమాజంలో మహిళలకు రక్షణ ఉందా అంటూ పలువురు ప్రముఖులు తమ గళం విప్పుతున్నారు. మహిళా భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో నటీమణులు మరింతగా లైంగిక వేధింపులు, దాడులకు గురి అవుతున్నారనేది సత్యం. దీనిపై ఇటీవల జస్టిస్ హేమ కమిటీ విడుదల చేసిన నివేదిక విస్తుపోయే నిజాలు బయటపెట్టింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో అసలు మహిళలకు రక్షణ, గౌరవం లేదని ఆ నివేదిక తేల్చింది. అవకాశాలు, రెమ్యునరేషన్ విషయంలో మహిళలు వివక్షతకు గురవుతున్నారు. ఒక మాఫియా మలయాళ చిత్ర పరిశ్రమను నడుపుతుంది. క్యాస్టింగ్ కౌచ్ తీవ్ర స్థాయిలో ఉంది. మహిళలు తమపై జరిగే లైంగిక దాడులను బయటపెట్టడం లేదు. వారు భయాందోళన చెందుతున్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొంది.
కాగా బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన మంచు లక్ష్మికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదట. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన మంచు లక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ ని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. అసలు సమాజంలో మహిళలకు సరైన స్థానం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలకు సమానత్వం ఉండాలి. అన్యాయం జరిగిన వెంటనే బయటపడి మాట్లాడాలని ఆమె సూచించారు.
కెరీర్ బిగినింగ్ లో తనకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదని మంచు లక్ష్మి పేర్కొన్నారు. తనతో అలా ప్రవర్తించిన వ్యక్తులతో ఆమె దురుసుగా వ్యవహరించేదట. దాని వలన ఆమె ఉద్యోగం పోయిందట. నువ్వు ఎవరికీ చెప్పలేవనే ధైర్త్యంతో ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. వాళ్లకు నువ్వు గట్టిగా నో చెప్పగలగాలని మంచు లక్ష్మి పేర్కొంది. హేమ కమిటీ రిపోర్ట్ పై తనకు అవగాహన లేదని మంచు లక్ష్మి అన్నారు.
సీనియర్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మోహన్ బాబు కుమార్తె అయిన మంచు లక్ష్మి తన కెరీర్ అమెరికాలో స్టార్ట్ చేసింది. టెలివిజన్ హోస్ట్ గా పలు షోలకు వ్యవహరించింది. రెండు మూడు ఆంగ్ల చిత్రాల్లో ఆమె నటించారు. అనంతరం టాలీవుడ్ కి పరిచమైంది. అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ చేసింది. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించడం విశేషం.
ప్రస్తుతం మంచు లక్ష్మి తన మకాం టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి మార్చింది. ముంబైలో ఓ లగ్జరీ హౌస్ అద్దెకు తీసుకుని ఉంటుంది. బాలీవుడ్ లో ఎదిగే ప్రయత్నం చేస్తుంది.