https://oktelugu.com/

America: అమెరికాలో భరత నాట్యం అరంగేట్రం.. అదరగొట్టిన తెలుగు తేజం వర్షిణి!

మన భరత నాట్యం ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ఆదరణ పొందుతోంది. ఇటీవలే చైనాకు చెందిన 13 ఏళ్ల చిన్నారి అరంగేట్ర ప్రదర్శనతో ఆకట్టుకుంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు తేజం భరతనాట్యం అరంగేట్రం ప్రదర్శనతో ఔరా అనిపించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 23, 2024 / 10:38 AM IST

    America

    Follow us on

    America: భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. దక్షిణ భారతదేశం లోని పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరసలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని ‘తంజావూరు‘లో ’నట్టువన్నులు’, దేవదాసీలు ఈ కళకు పోషకులు. భావం, రాగం, తాళం – ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతనూ ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం దాని మూలాలు మత ప్రాధాన్యతను కలిగి ఉండటమే. అంతే కాక తమిళుల చొరవ, ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించటం కూడా భరతనాట్య ప్రాభవానికి కారణాలు. ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన భరత నాట్యం తర్వాత ఆదరణ కోల్పోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కుతోంది. విదేశీయులు కూడా ఈ నాట్యంపై మక్కువ చూపుతున్నారు.
    కాలిఫోర్నియాలో అరంగేట్ర ప్రదర్శన..

    అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటోలో హారిస్‌ సెంటర్‌ థియేటర్లో ఆగస్టు 18న ప్రవాసాంధ్ర వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. వర్షిణికి 6వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్య శిక్షణ ఇప్పించారు. గురువు హేమ సత్యనారాయణన్‌ శిక్షణలో తన 16వ ఏట వర్షిణి భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమంకు ఉపక్రమించింది. ప్రాచీన నాట్య కళలకు అంతంత మాత్రంగా ప్రోత్సాహం ఉన్న ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం భరతనాట్యం ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో వర్షిణి దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఆత్మీయ అతిధులు ఫాల్సం నగర కౌన్సిలర్‌ శ్రీ చలంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ.. భారత సాంప్రదాయంలో భాగమైన నాట్యం వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమని చెప్పారు. రాంచో కార్డోవా నగర ప్రణాళికా కమీషనర్‌ సురేందర్‌ దేవరపల్లి నాట్యం వల్ల జీవితంతో సమతుల్యం ఏర్పడుతుందని, భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయము చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చునని అన్నారు. సువిధా ఇంటర్నేషనల్‌ సంస్థ వ్యవస్థాపకుడు భాస్కర్‌ వెంపటి మాట్లాడుతూ.. ఈ తరం యువతకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలనన్నారు.

    వర్షిణిపై ప్రశంసల జల్లు..
    ఇక భరతనాట్యం రంగప్రవేశం గావించిన వర్షిణి నాగంను అభినందిస్తూ వారు ఆమెకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్‌ హూవర్, అమెరికా జాతీయ కాంగ్రెస్‌ చట్ట సభ సభ్యుడు కెవిన్‌ కైలీ కార్యాలయం నుంచి వర్షిణి నాగంకు ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం సందర్భంగా అభినందిస్తూ ‘సిలికానాంధ్ర సంపద‘ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, చైర్మన్‌ ఆనంద్‌ కూచిభోట్ల విడుదల అభినందనాపత్రాన్ని ‘సంపద‘ అనుసంధానకర్త శాంతి కొండా తరపున నిర్వాహకులు వర్షిణికి అందజేశారు. ఈ కార్యక్రమంతో స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు హేమ సత్యనారాయణన్‌ పది రంగప్రవేశాలు పూర్తిచేసినందున ఆమెను అభినందిస్తూ నిర్వాహకులు వేదికపై ఆహుతుల, ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించారు.