Pushpa 2 Reloaded Version :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప 2 ‘(Pushpa 2 : the Rule ) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. మొదటి వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త సినిమాల కలెక్షన్స్ వేడి చల్లారిపోతున్న ఈ రోజుల్లో, ఒక నెల రోజులకు పైగా థియేటర్స్ లో అద్భుతంగా రన్ అయ్యి, 1840 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, 2000 వేల కోట్ల రూపాయిల గ్రాస్ వైపుకు దూసుకుపోవడం అనేది కేవలం ‘పుష్ప 2 ‘ విషయం లో మాత్రమే జరిగింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి ఇప్పటికీ 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయంటే జనాలు ఏ స్థాయిలో ఈ చిత్రాన్ని ఇరగబడి చూసారో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ సినిమాని ప్రతిష్టాత్మక రెండు వేల కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరేంత వరకు నిర్మాతలు శాంతించేలా లేరు. అందుకే ఇప్పుడు రీ లోడెడ్ వెర్షన్ అంటూ సరికొత్త 20 నిమిషాల సన్నివేశాన్ని జత చేసి ఈ నెల 11 వ తారీఖున విడుదల చేయబోతున్నారు. అంటే ‘గేమ్ చేంజర్’ లాంటి భారీ చిత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తూనే ఉంటుంది అన్నమాట. హిందీ ఆడియన్స్ ఎలాగో ఈ చిత్రాన్ని ఒక రేంజ్ లో చూస్తున్నారు కాబట్టి, వాళ్లకు ఇప్పటికీ ఈ సినిమానే మొదటి ఛాయస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్(Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer) చిత్రానికి ప్రస్తుతానికి బాలీవుడ్ లో పెద్దగా హైప్ లేదు. సినిమాకి టాక్ వస్తే వేరేలా ఉంటుంది కానీ, టాక్ రాకపోతే మాత్రం అక్కడి ఆడియన్స్ ‘పుష్ప 2 ‘ కి మరో రౌండ్ వేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కొన్ని థియేటర్స్ ని సంక్రాంతి సినిమాలకు పోనివ్వకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. ఇక్కడ కూడా పండగ సెలవుల్లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో డిసెంబర్ లో విడుదలైన సినిమాలు సంక్రాంతికి కూడా దంచి కొట్టేశాయి. అందుకు ఉదాహరణ రవితేజ ‘ధమాఖా’ చిత్రమే. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాదు ఓటీటీ లో కూడా రీ లోడెడ్ వెర్షన్ నే విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ సినిమా మూడు గంటల నిడివి దాటి ఉంది. అయినప్పటికీ జనాలు విరగబడి చూసారు. ఇప్పుడు అదనంగా మరో 20 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారా లేదా అనేది చూడాలి. సాధారణంగా రన్ టైం ఎక్కువ ఉంటే కాస్త నెగటివ్ టాక్ వస్తుంది. ఆ తర్వాత మరుసటి రోజున నిడివి తగ్గించాల్సిన పని పడేది. కానీ పుష్ప 2 విషయం లో ఒక్క నిమిషం నిడివి కూడా తగ్గించకపోగా, ఏకంగా 20 నిమిషాలు పెంచడం బహుశా చరిత్ర లో ఇదే తొలిసారి.