Parvatipuram Manyam : ఎవరైనా కోపంగా కొడతారు.. బాధతో కొడతారు.. వీడేంటిరా మరి శ్రద్ధతో కొట్టాడు. మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో డైలాగ్ ఇది.* మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas) కలం నుంచి జాలు వారింది ఈ డైలాగ్. అచ్చం అటువంటి ఘటనే పార్వతీపురం మన్యం( parvatipuram manyam ) జిల్లా పాలకొండలో వెలుగు చూసింది. ఓ ఉన్నతాధికారిపై దాడి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. పాలకొండ గారమ్మ కాలనీలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. అక్కడ సురేంద్ర కుమార్ ( Surendra Kumar) అనే వ్యక్తి ఏఎస్పీగా పని చేస్తున్నారు. అయితే నవగాం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న ఏబీపీఎం దుర్గాప్రసాద్( Durga Prasad) ఏ ఎస్ పి సురేంద్ర పై కక్ష పెంచుకున్నాడు. తనకు సెలవులు ఇవ్వడం లేదన్న కారణంగా సురేంద్ర పై దాడి చేయించాలని ప్లాన్ చేశాడు. తాను సురేంద్ర పై దాడి చేస్తే ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని భావించాడు. అందుకే విజయనగరానికి చెందిన అంబటి ప్రకాష్, పుర్రి రాజు, షేక్ సాజన్ లను సంప్రదించాడు. సురేంద్ర పై దాడి చేసేందుకు వారితో డీల్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు ఒకరోజు ముందుగానే ఏఎస్పి సురేంద్ర పై నిఘా పెట్టారు. ఆయన కదిలికలను గమనించారు. గత ఏడాది అక్టోబర్ 8న ముందుగానే ప్లాన్ చేసుకుని సురేంద్ర ఇంటి వద్ద కాపు కాసి మరి దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. స్థానికులు గుమిగూడేసరికి ఆ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు.
* తమదైన శైలిలో పోలీసు విచారణ
మరోవైపు బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కుటుంబానికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మరి ఎవరి పైన అనుమానం ఉందా? అంటూ ఆరా తీశారు. అటు శాఖాపరమైన విభేదాలు ఎవరితోనైనా ఉన్నాయా అని ఆరా తీసే క్రమంలో.. దుర్గాప్రసాద్( Durga Prasad) పై అనుమానం వచ్చింది. సెలవులు విషయంలో పలుమార్లు దుర్గాప్రసాద్ తనతో వాదనకు దిగినట్లు చెప్పుకొచ్చారు శ్యాం కుమార్. ఆయన వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండేదని పోలీసులకు చెప్పుకొచ్చారు. అయితే గత రెండు నెలలుగా దుర్గాప్రసాద్ కదలికలపై దృష్టి పెట్టారు పోలీసులు. అదుపులోకి తీసుకొని విచారించగా తానే ఈ దాడికి ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. సెలవులు విషయంలో తరచూ ఇబ్బంది పెట్టడం వల్ల అలా చేయాల్సి వచ్చిందని పోలీస్ విచారణలో ఒప్పుకున్నాడు. దుర్గాప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనవసరంగా ఉన్నతాధికారిపై దాడికి పురిగొల్పి జైలు పాలయ్యాడు దుర్గాప్రసాద్. ప్రస్తుతం ఆ నలుగురిని పోలీసులు రిమాండ్ కు పంపారు.
* రెండు రోజుల కిందటే వ్యక్తి హాల్ చల్
పార్వతీపురం మన్యం( parvathipuram manyam ) జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు రోజుల కిందట మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి వీధిలో విద్యుత్ స్తంభం పైకి ఎక్కి.. వైర్లపై పడుకొని హల్చల్ చేశాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి అలా ఘాతుకానికి పాల్పడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇది వైరల్ కావడంతో అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
* కొత్తగా జిల్లా ఆవిర్భావం
జిల్లాల విభజనలో భాగంగా పార్వతీపురం మన్యం ఏర్పడింది. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు కలుపుతూ కొత్త జిల్లా( new district) ఆవిర్భవించింది. అయితే మారుమూల ప్రాంతం కావడం.. మన్య ప్రాంతం కావడం.. ఇతరత్రా కారణాలతో నేరాల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉంది. కొత్తగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ జరుగుతుండడంతో.. పార్వతీపురం మన్యానికి సిబ్బందిని కేటాయించాలని పోలీస్ శాఖ కోరుతోంది.