Korean Kanakaraju: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కూటమి పాలన అద్భుతంగా సాగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పధకాలు సమయానికి అందరికి అందుతున్నాయి , అభివృద్ధి జరుగుతోంది, రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి , పోలవరం పూర్తి అవుతోంది , రీసెంట్ గానే ‘తల్లికి వందనం’ పథకం కూడా అమలు అయ్యింది, పెట్టుబడులు భారీగా వస్తున్నాయి , ఇలా ఒక్కటా రెండా అన్ని చాలా చక్కగా సాఫీగా జరిగిపోతుంది. అయితే అభివృద్ధి ఉంటే సరిపోదు , సరైన రాజకీయ వ్యూహం కూడా ఉండాలి , లేదంటే ఓడిపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకు బెస్ట్ ఉదాహరణ రీసెంట్ తమిళనాడు ఎన్నికలే. స్టాలిన్ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించినప్పటికీ ఓడిపోయింది. కూటమి కి అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు , రాజకీయాల్లో ఎప్పుడైనా , ఏదైనా జరగొచ్చు. కూటమి 2029 లో మరోసారి గెలుపొందాలంటే , కచ్చితంగా టీడీపీ- జనసేన పార్టీ కార్యకర్తలు , క్యాడర్ పాలు నీళ్లు లాగా కలిసిపోయి ఉండాలి.
హై లెవెల్ లో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ ఎంతో సాన్నిహిత్యం గా ఒకే కుటుంబ సభ్యులు లాగా ఉంటున్నారు. కానీ అభిమానులు, కార్యకర్తలు అలా లేరు, పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో సోషల్ మీడియా లో కొట్లాడుకుంటున్నారు. ఉదాహరణకు రీసెంట్ గా విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ వివాదాన్నే తీసుకుందాం. నిన్న భారీ లెవెల్ లో విడుదలైన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాలోని ఒక సన్నివేశం లో కమెడియన్ సత్య సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేయడం ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది. ఇమిటేట్ చేయడం కొత్తేమి కాదు కానీ , మూవీ టీం కావాలని ఉద్దేశపూర్వకంగా సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేసి , సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్ కి సంబంధించిన ఒరిజినల్ వీడియో ని సోషల్ మీడియా లో బాగా ట్రోల్స్ కి గురయ్యేలా చేసి, ఇప్పుడు ఆ మేము ని ఇమిటేట్ చేసి క్యాష్ చేసుకోవాలని మూవీ టీం చూసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి నందమూరి ఫ్యాన్స్ తక్షణమే ఆ సన్నివేశాన్ని తొలగించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ మూవీ టీం క్షమాపణలు చెప్పకపోగా , మేము ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఆ సన్నివేశాన్ని చేయలేదని, గొప్పవాళ్ళని ఇమిటేట్ చేయడం మన టాలీవుడ్ కి కొత్తేమి కాదని , ఫన్నీ పద్దతిలో చిరంజీవి , పవన్ కళ్యాణ్ , కృష్ణ వంటి వారిని కూడా గతం లో ఇమిటేట్ చేశామని, ఇక్కడ ఒకరిని అగౌరవపరిచే ఉద్దేశ్యం ఒక్క శాతం కూడా లేదని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. కానీ అభిమానులు మాత్రం అలా తీసుకోవడం లేదు , ఎదురైనా సందర్భాలు కూడా అలాగే ఉన్నాయి మరి. అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి , వాళ్ళ మనోభావాలకు గౌరవం ఇస్తూ సన్నివేశాన్ని డిలీట్ చేయడం మంచిది , కానీ మూవీ టీం వెనక్కి తగ్గడం లేదు. వరుణ్ తేజ్ మీ అన్న కొడుకు కదా, కంట్రోల్ లో పెట్టలేరా అంటూ తెలుగు దేశం పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కేవలం సోషల్ మీడియా కి మాత్రమే పరిమితం కాలేదు , గ్రౌండ్ లెవెల్ లో కూడా టీడీపీ క్యాడర్ వరుణ్ తేజ్ ఎన్టీఆర్ ని అవమానించినట్టుగానే భావిస్తున్నారు. ఈ ప్రభావం కాస్త రాబోయే స్థానిక ఎన్నికలపై పడనుందా?, కూటమి ఓట్లలో భారీ స్థాయి చీలికలు జరగబోతున్నాయి అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.