ibomma Ravi: ఆన్లైన్లో సినిమాలు చూసేవారికి ఐ బొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త సినిమాలను అది కూడా సూపర్ క్వాలిటీతో ఈ సైట్ సినిమాలను అందిస్తుంది. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని దక్కించుకుంది. ఐ బొమ్మ సైట్ వల్ల సినిమాలు చూసే వారికి ఆనందం కలుగుతున్నప్పటికీ.. సినిమా నిర్మాతలకు మాత్రం తీవ్రమైన నష్టం ఏర్పడుతోంది. అందువల్లే నిర్మాతలు ఐ బొమ్మ సైట్ నిర్వాహకుల మీద యుద్ధం ప్రకటించారు. అయితే సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను పాటించే ఐ బొమ్మ తెలుగు సినిమా నిర్మాతలకు చిక్కలేదు. దొరకలేదు.
ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఐ బొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు ఏకంగా సవాల్ విసిరాడు. తనను పట్టుకోలేరని.. మీకు అంత సీన్ లేదని పోలీసుల ఈగో మీద దెబ్బ కొట్టాడు. దీంతో పోలీసులు ఐ బొమ్మ రవి మీద ప్రధానంగా దృష్టి సారించారు. గత సెప్టెంబర్ లో ఐ బొమ్మ మూలాలలోకి వెళ్లిన తెలంగాణ పోలీసులు.. ఆ తర్వాత ఐ బొమ్మ రవిని అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. ఏం జరుగుతుందో ఊహించే లోపే.. అతడిని జైలుకు పంపించారు. అతని ఖాతాలో ఉన్న మూడు కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. అతడి వెబ్సైట్లు పనిచేయకుండా నిలుపుదల చేశారు. వాస్తవానికి రవి దొరకడం ఒకరకంగా సంచలనం సృష్టించింది. అతడు అలా దొరకడానికి మాజీ భార్య కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల సెప్టెంబర్ లో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఐ బొమ్మ నిర్వాహకులకు సంబంధించి కీలక ఆధారాలు సంపాదించామని వెల్లడించారు. దీనికోసం అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ ఉపయోగించామని పేర్కొన్నారు. అయితే కొంతకాలంగా తెలంగాణ పోలీసులు ఐ బొమ్మ మీద తీవ్రంగా దృష్టి సారించారు. అప్పట్నుంచి ఐ బొమ్మ నిర్వాహకుల వ్యవహారాలను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసుకుంటూ వస్తున్నారు. ఐ బొమ్మ రవి ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి నగదు స్వీకరించాడు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ తర్వాత దాని ఐపీ అడ్రస్ లభించింది. అది కాస్త మూసాపేటలోని విస్టా అపార్ట్మెంట్స్ ను చూపించింది.
రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు రెండు రోజులుగా అక్కడ రెక్కి నిర్వహించారు. ఈ లోగానే రవి ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చాడు. మొదటి సమాచారాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. రవిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఐ బొమ్మ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. అతని ఖాతాలో ఉన్న మూడు కోట్లను నిలుపుదల చేశారు. బెట్టింగ్ యాప్ ల ద్వారా అతడు ఎంత సంపాదించాడు? ఏ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు? అనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.