
Happy Birthday Trivikram: త్రివిక్రమ్.. వెండితెరపై మాటల తూటాలు పేల్చిన మాటల మాంత్రికుడు, జీవిత సత్యాలను చిన్న పలుకులోనే పలికించగల నేర్పరి త్రివిక్రమ్. సున్నితమైన హాస్యంతో నవ్వించాలన్నా, అనుబంధాల గురించి గుండె బరువెక్కేలా భావాన్ని పలికించాలన్నా ఈ తరంలో ఒక్క త్రివిక్రమ్ కే చెల్లింది. కేవలం తన మాటలతోనే మంత్రం చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది త్రివిక్రమ్ కి పెన్నుతో పెట్టిన విద్య. అందుకే, నేటి రచయితలందు త్రివిక్రమ్ వేరయా అనేది. ఏది ఏమైనా త్రివిక్రమ్ సినిమా చూస్తున్నంత సేపు త్రివిక్రమ్ ఆలోచనలే ప్రేక్షకుడి మదిలో కదలాడుతూ ఉంటాయి.
నేడు ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. మరి తన మాటలతో, చమత్కారాలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసే త్రివిక్రమ్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. త్రివిక్రమ్.. ఆకెళ్ళ ఉదయ్ భాస్కర్, నరసమ్మ దంపతులకు జన్మించారు. చిన్న తనం నుంచి సాహిత్యం పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. దీనికి తోడు త్రివిక్రమ్ పెరిగింది మొత్తం భీమవరంలోనే. అందుకే ఆయన రచనలకు వెటకారం అలవాటు అయింది.
ఇక త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. బాగా చదువుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చి.. రచయితగా ఎదుగుతున్న రోజుల్లో ఆయనకు పేరు మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఆయన కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని.. త్రివిక్రమ్ అనే పేరును పెట్టుకున్నారు. అన్నట్లు త్రివిక్రమ్ కి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అంత తేలికగా రాలేదు. రచయిత పోసాని దగ్గర అసిస్టెంట్ గా చేరడానికే త్రివిక్రమ్ మూడేళ్ళు కష్టపడ్డారు. అలా పోసాని దగ్గర నాలుగేళ్లు పని చేశారు.
ఆ తర్వాత స్వయంవరం సినిమాతో సోలో రైటర్ గా టర్న్ అయ్యారు. మొదటి సినిమా నుంచే తన పెన్ పవర్, తన ఫన్ పవర్ చూపించడంలో త్రివిక్రమ్ బాగా సక్సెస్ అయ్యాడు. దాంతో త్రివిక్రమ్ పేరే ఒక బ్రాండ్ అయింది. మెయిన్ గా త్రివిక్రమ్ మాటల గారడీ తెలియాలంటే.. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ లాగే త్రివిక్రమ్ స్పీచ్ లకు కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినా మాస్ పల్స్ బాగా తెలిసినవాడు త్రివిక్రమ్.
అన్నిటికీ కంటే ముఖ్యంగా మాటలు రాసినందుకు కోటి రూపాయల పారితోషికం అందుకున్న మొట్టమొదటి రచయిత కూడా త్రివిక్రమే. అలాగే బెస్ట్ డైలాగ్ రైటర్ గా ఐదుసార్లు నంది అవార్డులు అందుకున్న ఏకైక రైటర్ కూడా త్రివిక్రమే. సహజంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండే త్రివిక్రమ్ కి, మా ఓకే తెలుగు తరపున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.
Also Read: త్రివిక్రమ్ మాటలు పై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ !