Punith Rajkumar: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బెంగళూరులోని సదాశివనగర పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ వైద్యుడైన రమణరావును తక్షణ అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, డాక్టర్ రమణరావు నివాసం, క్లినిక్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని, క్లినిక్ వచ్చినప్పుడు అతనికి ప్రాథమిక చికిత్స మాత్రమే చేసినట్లు రమణరావు పేర్కొన్నారు.

అయితే, ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తు వచ్చేవారు పునీత్. కానీ, గత నెల 29న జిమ్‌లో వర్క్ఔట్స్ చేస్తూ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ వైద్యుడిని సంప్రదించగా.. ఆయన ప్రాథమిక చికిత్స అందించి వెంటనే ఆసుపత్రిలో చేరమని పనిత్కు రమణరావు సూచించారు. ఈ నేపత్యంలోనే పునీత్ విక్రమ్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా మరణించారు. వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయింది.
దీంతో ఆయన అభిమానులతో పాటు యావత్ సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. పునీత్ చనిపోయిన ఇప్పటికి వారం గడుస్తున్నా.. ఆయన అభిమానుల్లో కొంత మంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఈ విషయంపై పునీత్ సతీమణి స్పందించారు. పునీత్ లేని లోటు తమ కుటుంబానికి తీరని లోటుగా పేర్కొన్నారు. అటువంటి లోటు ఏ కుటుంబంలో రాకూడదని కోరారు. కనుక, పునీత్ అభిమానులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. భౌతికంగా పునీత్ మన మధ్య లేకపోయినా.. ఆయన ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటారని అన్నారు.