Hanuman Ansh Movie Review: బాలీవుడ్ లో ఈ ఏడాది అద్భుతాలను నెలకొల్పిన చిత్రం ‘హనుమాన్ అంశ’. కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు 430 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఆధ్యాత్మిక గురువు , సిద్ధపురుషుడు నీం కరోలీ బాబా జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీ లో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాని నేడు తెలుగు లో కూడా విడుదల చేశారు. మరి తెలుగు ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం నచ్చిందా లేదో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
ఈ కథ మనకి స్వాతంత్రం రాక ముందుది. డాక్టర్ రామ్ నందన్ భోంస్లే (చందం ఆనంద్) ఒక స్వతంత్ర సమరయోధుడు, అదే సమయం లో కరుడుగట్టిన నాస్తికుడు కూడా. దైవత్వాన్ని ఏ మాత్రం నమ్మని మనుషుల్లో ఒకరైన ఈయన్ని ఒక సంఘటన మానసికంగా కుదిపేస్తోంది. అలాంటి సమయం లో ఆయనకు లక్ష్మినారాయణ శర్మ (శోభినవ్ సత్య) పరిచయం అవుతాడు. ఆ సాధారణ బ్రాహ్మణ యువకుడు కాలం గడిచే కొద్దీ ఘోర తపస్సు , అనుగ్రహం తో ‘నీం కరోలి బాబా’ గా ఎలా మారిపోయాడు?, ఆధ్యాత్మిక మార్గం లో నడిచిన ఆయన , తన జీవిత ప్రయాణం లో ఎంతమంది జీవితాల్లో వెలుగుల్ని నింపాడు అనేదే ఈ సినిమా.
విశ్లేషణ :
ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే , ఎమోషనల్ గా స్క్రిప్ట్ ని చాలా బలమైన సన్నివేశాలతో నింపాలి. అలా నింపడం లో డైరెక్టర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు అనే చెప్పొచ్చు. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఒక చక్కటి అనుభవం కలుగుతుంది. ప్రతీ సన్నివేశం ఒక అబ్దుతమైన పెయింటింగ్ లాగా మలిచాడు డైరెక్టర్. ముఖ్యంగా బ్రటిష్ అధికారితో రైలు ప్రయాణం చేసే ఒక సన్నివేశం , పార్వతి ఇంట్లో భోజనం చేసే సన్నివేశం , ఇంటర్వెల్ కి ముందు శివతత్వాన్ని ఆవిష్కరించే అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేస్తాయి. అయితే ఇప్పటి జనాలు ఎక్కువగా కమర్షియల్ మీటర్ లోనే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా చాలా స్లో గా నడుస్తుంది అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా బాబా గురించి తెలియని వాళ్లకు కొన్ని ఘట్టాలు రిపీట్ అయిన అనుభూతి కూడా కలుగుతుంది. ఓవరాల్ గా ఈ వీకెండ్ లో తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా తెరకెక్కించిన ఈ సినిమా , ప్రతీ ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి మేము ఇస్తున్న రేటింగ్స్ 3.25/5.