Bigg Boss Telugu 8: ప్రతీ బిగ్ బాస్ సీజన్స్ లో వచ్చే ఫ్యామిలీ వీక్స్ ఆడియన్స్ కి బోరింగ్ ఎపిసోడ్స్ అవ్వొచ్చు కానీ, హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కి మాత్రం మానసికంగా మంచి బూస్ట్ ని ఇచ్చే వీక్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో నబీల్ తల్లి, రోహిణి తల్లి, యష్మీ తండ్రి వచ్చారు. వీళ్ళు కంటెస్టెంట్స్ తో సరదాగా, ప్రేమగా మాట్లాడిన మాటలు చూసే ఆడియన్స్ కి చాలా బాగా అనిపించింది. ఇదంతా పక్కన పెడితే ప్రతీ కంటెస్టెంట్ ఫ్యామిలీ వచ్చి వెళ్లే సమయంలో టేస్టీ తేజ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే గత వారం ఆయన కారణంగా జరిగిన కొన్ని సంఘటనల వల్ల హౌస్ మేట్స్ అందరూ అతన్ని వరస్ట్ కంటెస్టెంట్ గా ఎంచుకున్నారు.
వరస్ట్ కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యినందున టేస్టీ తేజ ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేందుకు వీలు లేదని నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో చెప్తాడు. దీనికి టేస్టీ తేజా చాలా బాధపడుతాడు. అసలు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ కి రావడానికి కారణమే ఈ ఫ్యామిలీ వీక్ లో మా అమ్మని తీసుకొని రావొచ్చు అనే సార్ అని ఏడ్చేస్తాడు టేస్టీ తేజ. ఇది ఆయన మనసులో అలా ఉండిపోతుంది. అందరి కుటుంబాలు హౌస్ లోకి వస్తున్నాయి, ఒక్క నా కుటుంబం తప్ప, కావాలంటే నన్ను ఎలిమినేట్ అయ్యే వరకు నామినేషన్స్ లో పెట్టండి బిగ్ బాస్. దయచేసి మా అమ్మని లోపలకు పంపించండి అంటూ వాష్ రూమ్ వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మరోపక్క నిఖిల్ నా వల్లే తేజ వాళ్ళ అమ్మగారు లోపలకు రాలేకపోతున్నారు. నాకు ఇప్పుడు మా అమ్మ వచ్చినా ఈ బాధ వల్ల ఆనందం అనిపించదు అని అంటాడు. నిఖిల్ అలా ఫీల్ అవ్వడానికి కారణం అతను కూడా తేజ వరస్ట్ కంటెస్టెంట్ అంటూ కన్ఫెషన్ రూమ్ లో ఓటు వేసిన వాడు కాబట్టి. అయితే తేజ బాధని అర్థం చేసుకున్న గౌతమ్ కెమెరా వద్దకు వెళ్లి మాట్లాడిన మాటలు చూస్తే ఎలాంటి వాళ్ళైనా మెచ్చుకోక తప్పదు.
ఆయన మాట్లాడుతూ ‘బిగ్ బాస్ నేను నా ఫ్యామిలీ వీక్ ని తేజ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గత సీజన్ లో నా కోసం మా అమ్మ వచ్చింది. అది చాలు నాకు. టేస్టీ తేజ కి గత సీజన్ లో ఫ్యామిలీ వీక్ వరకు ఉండలేకేపోయాడు. ఈ సీజన్ లో ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య సంఘటనల వల్ల వాడికి శిక్ష పడింది. దయచేసి వాళ్ళ అమ్మని లోపలకు పంపించండి. నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకొస్తాడు. ఇది బిగ్ బాస్ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ చూపిస్తాడట. దీంతో టేస్టీ తేజ బాగా ఎమోషనల్ అయిపోతాడట. ఈ ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ కానుంది.