Raghurama Krishna Raju: ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రఘురామకృష్ణంరాజు. వైసీపీ ఎంపీగా నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. గెలిచిన ఆరు నెలలకే పార్టీకి దూరమయ్యారు. అధినేత జగన్ తో విభేదించారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీతో పాటు జగన్ వైఖరిని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. చివరి నిమిషంలో ఉండి అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచిన రఘురామకృష్ణం రాజుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టిడిపికి విమర్శనాస్త్రాలు అందించారు రఘురామకృష్ణంరాజు. అందుకు తప్పకుండా ఆయనకు మంచి పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే తనకు స్పీకర్ కావాలని ఉందని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు ఆయన. అసెంబ్లీ స్పీకర్ పదవికి ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కింది ఆ పదవి. అటు క్యాబినెట్లో చోటు దక్కక.. ఆశించిన స్పీకర్ పదవి రాకపోవడంతో మౌనంగా ఉండి పోయారు రఘురామకృష్ణంరాజు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ చీఫ్ విప్, అసెంబ్లీ, శాసనమండలి విప్ పదవులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణ రాజు కోరుకున్న విధంగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజును ఎంపిక చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
* జనసేనకు ఇస్తారని..
అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడుకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆయనకు ఈసారి శాసనసభ సభాపతిగా ఎంపిక చేశారు. కానీ అప్పట్లో డిప్యూటీ స్పీకర్ పోస్టు భర్తీ చేయలేదు. పొత్తులో భాగంగా జనసేనకు ఆ పదవి కేటాయిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది.రకరకాల పేర్లు అప్పట్లో వినిపించాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరు ప్రముఖంగా వినిపించింది. మరోవైపు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే వాటన్నింటికీ తెరదించుతూ రఘురామకృష్ణం రాజుకు అవకాశము ఇచ్చారు చంద్రబాబు.
* వివిధ సమీకరణల్లో భాగంగా
చంద్రబాబు తన మంత్రివర్గంలో 24 మందికి అవకాశం కల్పించారు. మరో మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అది రఘురామకృష్ణంరాజు కోసమేనని అప్పట్లో టాక్ నడిచింది. క్యాబినెట్లో క్షత్రియ వర్గానికి ఛాన్స్ ఇవ్వలేదు. మరోవైపు టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతి రాజుకు అవకాశం ఇచ్చి ఆ లోటును తీర్చుతారని కూడా టాక్ నడిచింది. కానీ టీటీడీ చైర్మన్ గా కమ్మ సామాజిక వర్గానికి చెందిన బిఆర్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. అందుకే ఇప్పుడు క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని భావించి.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చారు రఘురామకృష్ణం రాజుకు. మొత్తానికైతే అధ్యక్షా అనిపించుకోవాలని ఉందన్న రఘురామకృష్ణం రాజు మాటను చంద్రబాబు నెరవేర్చారన్నమాట.