Pushpa 2: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మేనియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారం రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ఈ చిత్రం సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో వెతికే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ పేర్లను గూగుల్ లో వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిచయం అక్కర్లేని పేర్లు ఇవి. కానీ ఈ సినిమాలో నటించిన మిగిలిన నటీనటుల గురించి మాత్రం నెటిజెన్స్ సోషల్ మీడియా లో తెగ వెతికేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా అల్లు అర్జున్ మాత్రమే కాదు, వీళ్లంతా కూడా అద్భుతంగా నటించారు కాబట్టి. నటించారు అనడం కంటే కూడా జీవించారు అని చెప్పొచ్చు. డైరెక్టర్ సుకుమార్ కి ఆర్టిస్టుల నుండి పెర్ఫార్మన్స్ పిండుకోవడం మామూలే.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ తల్లిగా నటించిన ఆర్టిస్టు మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అంత తేలికగా మర్చిపోయే పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వలేదు ఆమె. రెండు భాగాల్లోనూ ఆమె చిత్తూరు యాసలో, చాలా సహజంగా నటించింది. ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు తమని తాము వెండితెర మీద చూసుకున్నట్టు ఉంటాది. అంత చక్కగా నటించింది. ఈమె పేరు కల్పలత. ఈమె 2018 వ సంవత్సరం లో విడుదలైన నేచురల్ స్టార్ నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమగాధ’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. బాహుబలి సిరీస్ లో కూడా నటించింది కానీ, గొప్పగా పేరు మాత్రం రాలేదు. కానీ అవకాశాలకు మాత్రం ఈమెకు కొదవే లేదు. ఇప్పటి వరకు ఈమె దాదాపుగా 32 సినిమాల్లో నటించింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఈమెకు ఆడియన్స్ లో గుర్తించుకోదగ్గ పాత్ర దొరికింది మాత్రం పుష్ప సిరీస్ లోనే.
పుష్ప రెండు భాగాల్లోనూ ఈమెకి నటనకు స్కోప్ ఉండే విధంగానే డిజైన్ చేసాడు డైరెక్టర్ సుకుమార్. సెంటిమెంటల్ సన్నివేశాల్లో ఈమె ఆడియన్స్ చేత కంటతడి పెట్టించింది. ఇన్ని రోజులు ఆమె కెరీర్ ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క. ఈ సినిమా తర్వాత కల్పలత కి టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే రీసెంట్ గానే ఈమె తన కూతురుకి పెళ్లి చేసింది. ఈ పెళ్ళికి డైరెక్టర్ సుకుమార్ కూడా పాల్గొన్నాడు. ఈ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోల్లోని ఈమె కూతురుని చూసిన నెటిజెన్స్, చాలా అందంగా ఉంది, ఈమెను సినిమాల్లోకి ఎందుకు తీసుకొని రాలేదంటూ ప్రశ్నిస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ అమ్మాయి విదేశాల్లో స్థిరపడింది. భవిష్యత్తులో ఈమె ఏమైనా అవకాశం ఉంటే సినీ రంగంలోకి వస్తుందో లేదో చూద్దాం.