
తమిళ దర్శకుడు శంకర్ గురించి సినీప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సౌత్ ఇండియా సినిమా స్టామినాను ప్రపంచ స్థాయికి చేర్చిన దర్శకుల్లో శంకర్ ఒకడు. అయితే గత కొంతకాలంగా శంకర్ నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమాలు రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘రోబో’ వంటి సూపర్ హిట్టు తీసిన శంకర్ ఆ తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోతున్నాడు. రోబో తర్వాత శంకర్ నుంచి వచ్చిన సినిమాలేవీ అభిమానులను అలరించలేకపోయాయి. దీంతో చాలా గ్యాప్ తీసుకొని దశాబ్దం క్రితం సూపర్ హిట్టుగా నిలిచిన ‘ఇండియన్(భారతీయుడు)’ సినిమాకు సిక్వెల్ తీస్తున్నాడు.
భారతీయుడిగా సిక్వెల్ గా వస్తున్న ‘ఇండియన్-2’ సినిమాపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతోపాటు ఇటీవల ఈ సినిమా షూటింగులో భారీ ప్రమాదం జరిగి శంకర్ కు అసిస్టెంట్ పని చేస్తున్న పలువురు దర్శకులు చనిపోయారు. నాటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి నోచుకోలేదు. అదేవిధంగా ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తీరుతో విసిగిపోయిన శంకర్ కొత్త సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కరోనాతో వచ్చిన గ్యాప్ లో దర్శకుడు శంకర్ తన తర్వాతి సినిమాకు కథను సిద్ధం చేసుకున్నాడు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మాదిరిగానే శంకర్ కూడా మల్టిస్టారర్ మూవీని ప్లాన్ చేశాడు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. రాంచరణ్ నటిస్తుండగా శంకర్ తెరకెక్కించే మూవీలో కన్నడ నుంచి ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్.. తమిళం నుంచి విజయ్ సేతుపతి నటించనున్నారట. ఈ మూవీని కన్నడ స్టార్ ప్రొడ్యుసర్ రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించనున్నాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది