డైరెక్షన్ ఛాన్స్ అంటే ఈ రోజుల్లో ఈజీ అయింది గానీ, ఆ రోజుల్లో.. అంటే ముప్పై ఏళ్ల కిందటి మాట. అప్పట్లో కొత్త దర్శకుడి మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టి సినిమా తీసే ధైర్యం ఏ నిర్మాతకు ఉండేది కాదు. అందుకే, ఆ రోజుల్లో కొత్త దర్శకులంటే నిర్మాతలు కాస్త దూరంగా ఉండేవారు. అందుకే కావొచ్చు, ఆ కాలంలో దర్శకులు కూడా తక్కువుగా ఉండేవారు. భగవంతుడు కరుణించి ఎవరన్నా అవకాశం ఇస్తే తప్ప, మరో అవకాశం లేని రోజులు అవి.
ఇవన్నీ తెలుసు కాబట్టే కోదండరామిరెడ్డి కో–డైరెక్టర్ గానే కొనసాగుదాం అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒకరిద్దరు హీరోలు తప్ప మిగిలిన ఏ హీరో కూడా కొత్త దర్శకుడ్ని ఎంకరేజ్ చేసే వారు కాదు. కానీ, కోదండరామిరెడ్డి పడే కష్టం తెలిసిన వ్యక్తిగా, రాఘవేంద్రరావు అతన్ని ఎప్పుడు ప్రోత్సహించేవాడు. అతనికి డైరెక్షన్ ఛాన్స్ వచ్చేలా నిర్మాతలకు కోదండరామిరెడ్డి గురించి కొన్ని మంచి మాటలు చెప్పేవాడు.
కానీ ఎక్కడా ప్రాజెక్ట్ వర్కవుట్ అవలేదు కోదండరామిరెడ్డికి. ఆ సమయంలోనే కె.ఎస్.రామారావు అనే కుర్రాడు పరిచయమయ్యాడు కోదండరామిరెడ్డికి. లక్ష్మీ ఫిల్మ్స్ అధినేత లింగమూర్తిగారికి కె.ఎస్.రామారావు రైట్ హ్యాండ్ లా ఉంటూ అన్నీ పనులు చూసుకునేవాడు. ‘ఓ రోజు ఏమండీ.. డైరెక్షన్ చేస్తారా?’ అంటూ రామారావు, కోదండరామిరెడ్డిని అడిగారు. అప్పటికే డైరెక్షన్ చేయాలనే కోరికతో రగిలిపోతున్న కోదండరామిరెడ్డిలో ఉత్సాహం ఎగసిపడింది.
కట్ చేస్తే.. హీరో కృష్ణగారి బావమరిది సూర్యనారాయణబాబు ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కె.ఎస్.రామారావు సాయంతో అక్కడికి చేరుకున్నాడు కోదండరామిరెడ్డి. ‘నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తాను’ అంటూ సూర్యనారాయణబాబు, కోదండరామిరెడ్డికి మాట ఇచ్చారు. అంతే.. కథ పై కొంతకాలం తీవ్రంగా వర్క్ చేశాడు కోదండరామిరెడ్డి. షూటింగ్ కి వెళ్లే సమయంలో నిర్మాణానికి బ్రేక్ పడింది. రెండు ఏళ్ళు గడిచిపోయాయి.
కానీ, సూర్యనారాయణ బాబు దర్శకుడిగా పరిచయం చేస్తాను అని కోదండరామిరెడ్డికి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి సావరిన్ ఫిల్మ్స్ బ్యానర్ అంటూ ఓ బ్యానర్ పెట్టి కోదండరామిరెడ్డి కోసం సినిమా తీశాడు సూర్యనారాయణబాబు. అది… ఆ రోజుల్లో మాటకు అంత విలువ ఇచ్చేవారు. ఆ మాటే ఓ దిగ్గజ దర్శకుడ్ని తయారుచేసింది.